వాస్తవంలోకి వస్తున్న వైసీపీ నేతలు… జగన్ ఎప్పుడో?

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా పార్టీ ఓడిపోయింది. ఈ సమయంలో స్పందించిన ఆ పార్టీ అధినేత జగన్… ఈవీఎంల వల్లే ఓడిపోయినట్లు చెప్పారు. శకుని పాచికల మాదిరి ఈవీఎంల ఫలితాలు ఉన్నాయని వెల్లడించారు. అయినప్పటికీ వయసు ఉంది, ఓపిక ఉంది.. ప్రజల కోసం పోరాడతానని తెలిపారు.

అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓటమిని హుందాగా అంగీకరించకుండా… 2019 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చేసినట్లుగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏముందని పలువురు ప్రశ్నించారు. మరోపక్క… ఈవీఎంలలో మోసాలు జరిగాయనేది నిజమని చెబుతూ పలు ఉదాహరణలు తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికలు చాలా అద్భుతంగా నిర్వర్తించామని ఎన్నికల కమిషన్ చెప్పుకుంది!

దీంతో… అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు.. జరిగిన ఘోరానికి కారణాలు వెతుక్కోవడం ఎందుకు.. ఫలితాన్ని తీసుకోవాలి.. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకోవాలి.. ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రజా సమస్యలపై పోరాడాలి.. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే కనీసం మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరం అనేది మాటలు ఆర్థిక నిపుణుల నుంచి వినిపిస్తున్న మాటలు పరిగణలోకి తీసుకోవాలి.

జనాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను 60 నెలలు అమలు చేయాల్సి ఉంటుంది. కేవలం సామాజిక పెన్షన్ల విషయంలో తప్ప మరో సూపర్ సిక్స్ హామీని చంద్రబాబు ఇప్పట్లో నెరవేర్చి 5 ఏళ్లపాటు ఆ సంక్షేమ పథకాలను అమలుచేసే పరిస్థితి లేదనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… కాస్త ఓపిక పట్టాలి.. వీలైనంతరవరకూ ప్రజలకు ఇప్పటికైనా అందుబాటులో ఉండాలి.

గతంలో జగన్ ని పరదాల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసినవారు.. ఇప్పుడు కంచెల అవతల ప్రజలను పెట్టి.. ఆ కంచె కన్నాల్లోంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారనే విషయం జగన్ గుర్తించాలి. ఆరు నెలల్లో అధికార కూటమి పార్టీల నుంచి ఇలాంటి తప్పులు ఎన్నో జరుగుతాయి.. అవకాశాలు ఎన్నో వస్తాయి. వారే ఇస్తారు!!

ఆ సంగతి అలా ఉంటే… వైసీపీ నేతలు మాత్రం ఒక్కొక్కరుగా వాస్తవంలోకి వస్తున్నారు. జగన్ చెప్పినట్లుగా ఈవీఎం ల టాపిక్ పెద్దగా ఎత్తకుండా… తమ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పాలసీల పొరపాట్లు, తాము చేసిన అత్యుత్సాహ ప్రజాసేవ కూడా తమ ఓటమికి కారణాలని నొక్కి చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా… మద్యం పాలసీ తమకు పూర్తిగా ముంచేసిందని ఆయన ఓపెన్ గా చెప్పారు! ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి ఎన్నోసార్లు చెప్పినా ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన మారలేదని.. అది గట్టిగా దెబ్బ కొట్టిందని అన్నారు. ఇదే సమయంలో… ఇసుక పాలసీతోపాటు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం కూడా తమ ఓటమికి ఒక కారణం అని అన్నారు.

అనంతరం తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. ఇందులో భాగంగా తమ ఓటమికి వైఎస్ విజయమ్మ నిర్ణయాలు కూడా కారణం అని… షర్మిళ తప్పుచేశారని కుండబద్దలు కొట్టారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం అవుతుండటానికి చంద్రబాబు కంటే.. వైఎస్ షర్మిళే కారణం అని తాను చెబుతానని కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో తాము చేసిన సంక్షేమం అద్భుతమే అయినప్పటికీ… సీఎంవోలోని అధికారుల ప్రియారిటీలు వేరుగా ఉండటం వల్ల నియోజకవర్గాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేసుకోలేకపోయామని ఓపెన్ అయిపోయారు. ఉదాహరణకు తన నియోజకవర్గంలో ఫ్లైఓవర్ కోసం 10 – 15 కోట్లు అవసరమయ్యి జగన్ కు చెబితే అందుకు ఆయన అంగీకరించారని అన్నారు.

ఇదే విషయాన్ని సీఎంవోలోని ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి చెప్పారని తెలిపారు. అయితే.. ఆ సొమ్ము తన నియోజకవర్గానికి కేటాయించబడలేదని.. జగన్ ప్రియారిటీలు ఒకలా ఉంటే, సీఎంవోలోని అధికారుల ప్రియారిటీలు మరోలా ఉండేవని.. తమ ఓటమికి ఇవి కూడా ప్రధాన కారణాలని స్పష్టం చేశారు కేతిరెడ్డి. దీంతో… వైసీపీ ఓటమికి కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇలా వాస్తవంలోకి వచ్చి, తమ ఓటమికి గల కారణాలను గ్రౌండ్ లెవెల్ లో నేతల నుంచి తెప్పించుకుని పరిశీలించి.. మరోసారి ఆ పొరపాట్లు లేకుండా, జరగకుండా జాగ్రత్తపడతారా.. లేక, ఈవీఎం ల పేరు చెప్పి ఆత్మవంచన చేసుకుంటూనే ఉంటారా అనేది వేచీ చూడాలి. ఓటమి గల కారణాలు ఆయన బహిరంగంగా అంగీకరించకున్నా.. కనీసం ఆత్మపరిశీలన చేసుకోవాలని అంటున్నారు.