ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వచ్చేనెల మూడో వారం నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున.. పార్టీ శ్రేణులను సమాయాత్తం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకుంటున్న తన పెద్ద కుమార్తె వర్షా రెడ్డిని చూడటానికి జగన్ తన కుటుంబంతో సహా లండన్‌కు వెళ్లాల్సి ఉంది.
ఎన్నికల ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఇక ఆయన వరుసగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
తొలిదశలో లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షను చేపడతారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనికోసం ఆయన లోక్‌సభ టికెట్‌ను ఆశించే వారితో ముఖాముఖిగా భేటీ అవుతారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన పార్టీ లోక్‌సభ సభ్యుల్లో ఒకరిద్దరికి ఈ సారి టికెట్ దక్కకపోవచ్చనే అభిప్రాయం ఉంది.
వారి సేవలను పార్టీ కోసం వినియోగించుకోవడమో లేదా, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయించడమో ఉంటుందని అంటున్నారు. ఈ సారి ఎన్నికలకు వైఎస్ విజయమ్మ దూరంగా ఉంటున్నందున.. షర్మిలను లోక్‌సభ బరిలో దించే అవకాశాలు లేకపోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.