వైసీపీలో హీరో ఉన్నారు.. అది కూడ పవన్‌ను మించిన హీరో. ఇది నిజం.. కానీ ఆ హీరో సినిమా రంగానికి చెందినవాడు కాదు రాజకీయ క్షేత్రంలో హీరో. ఆయనే స్వయంగా తిప్పల నాగిరెడ్డి. గత ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీచేసిన ఆయన పవన్ మీద గెలిచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపారు. గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీచేసినపవన్ గాజువాక మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన అభిమానులు సైతం గాజువాక మాదే అంటూ ధీమాగా ఉన్నారు. కానీ తిప్పల నాగిరెడ్డి వారి ఆశలను, అంచనాలను తలకిందులు చేశారు. 16 వేల పైచిలుకు ఓట్లతో పవన్ మీద విజయబావుటా ఎగురవేసి సెన్సేషన్ అయ్యారు. పార్టీలో పవన్‌ను మించిన హీరో ఈయన అనిపించుకున్నారు.
అంతేగా మరి.. పవన్ గాజువాకను ఏరి కోరి ఎంచుకున్నారు. గతంలో అక్కడ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గెలుపొంది ఉన్నారు. సామాజికవర్గా ఓటు బ్యాంకు దృష్ట్యా బలమైన ప్రాంతం. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన నాగిరెడ్డి 2019 లో పవన్ మీద గెలుస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ తిప్పల నాగిరెడ్డి పవన్‌ను ఓడించారు. కాబట్టి ఆయన్ను హీరోనే అనుకోవాలి. ఆ గెలుపుతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సామాజికవర్గ సమీకరణాల దృష్ట్యా వైఎస్ జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అలాగని అయన్ను మర్చిపోలేదు కూడ.
అంత ఘనమైన విజయం సాధించిన నాగిరెడ్డికి సముచిత స్థానం ఇవ్వాలనే నిర్ణయంతోనే ఉన్నారు. సమయం కోసం ఆగారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్ ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాగిరెడ్డికి ఇవ్వాలని అనుకుంటున్నట్టు భోగట్టా. పార్టీ వర్గాల్లో ఈ విషయమే ప్రస్తుతం హాట్ టాపిక్. నాగిరెడ్డికి ఈ కీలక పదవి ఇవ్వడం పట్ల పార్టీలో ఎక్కడా వ్యతిరేకత కూడ లేదట. అందరూ జగన్ నిర్ణయాన్ని సరైనదనే అంటున్నారట. ఇవాళో రేపో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద జగన్ పార్టీని నమ్ముకున్నవారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మరోసరి ప్రూవ్ కాబోతోందన్నమాట.