విశాఖపట్నం ఆంధ్రాకు ప్రధాన ఆదాయ నగరం. పారిశ్రామికంగా అన్ని విధాల విశాఖ అభివృద్ది చెందిన నగరం. రాష్ట్రం విడిపోనప్పుడు చాలా మంది విశాఖను రాజధానిని చేయవచ్చు కదా అన్నారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఆయన దిగిపోయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో సీన్ మారిపోయింది. కొత్త ముఖ్యమంత్రి మూడు రాజధానులు అనే కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా ఆయన విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి ప్రతిపక్షాలు అడ్డుపడినా జగన్ ఆగట్లేదు. దాదాపుగా ప్రక్రియ మొత్తం పూరైంది. ఇంకొన్ని నెలల్లో అన్ని సమస్యలు ముగిసి విశాఖలో కుర్చీ వేసుకుని కూర్చుంటారు జగన్.
ముందే టీడీపీని ఖాళీ చేయాలని:
కొత్తగా ఏర్పడనున్న మూడు రాజధానుల్లో పాలనాపరమైన రాజధాని కాబోయే విశాఖకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అలాంటిచోట ఏ పార్టీ అయినా తమ హవా కనబరచాలని ఆశపడటం మామూలే. కానీ వైఎస్ జగన్ మాత్రం హవా ఉండటం కాదు తమ హవా మాత్రమే కనిపించాలని అనుకుంటున్నట్టు ఉన్నారు. అందుకే విశాఖ మొత్తం వైసీపీ మయం చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వైసీపీ 11 స్థానాలు గెలుచుకుంది. మిగతా నాలుగు స్థానాలు టీడీపీ సొంతం చేసుకుంది. తెలుగుదేశం గెలిచినవి నాలుగు స్థానాలే అయినా ముఖ్యమైన విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్ స్థానాలను గెలుచుకుంది. విశాఖపట్నం రాజధాని కానుంది కాబట్టి నగరంలోని ఈ నాలుగు నియోజకవర్గాలు ఏ పార్టీకైనా చాలా ముఖ్యమవుతాయి. అందుకే అక్కడ టీడీపీని ఖాళీ చేయించాలనేది వైసీపీ వ్యూహం అంటున్నారు.
ఇప్పటికే ఆపరేషన్ మొదలైంది:
అందుకే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి తెర తీసింది. ఇందులో ఎమ్మెల్యేలు పేరుకు టీడీపీయే అయినా వైసీపీ తరపున పనిచేస్తారు. ఇప్పటికే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలోకి లాగే పని ఒక కొలిక్కి వచ్చింది. పార్టీలోని చిన్న చిన్న చిక్కులు తొలగిపోతే ఆయన వైసీపీ వైపుకు వచ్చేస్తారు. అలాగే విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పక్కకు లాగే పని మొదలైందట. వెలగపూడికి టీడీపీలో, నియోజకవర్గంలో చాలా మంచి పేరు, పట్టు ఉన్నాయి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి వ్యక్తి పార్టీలో ఉంటే మేలని భావించి ఆయన మీద ద్రుష్టి పెట్టారట. అన్ని రకాల హామీలు ఇచ్చి తమలో కలుపుకోవడానికి ట్రై చేస్తున్నారు. వైసీపీలో కూడా ఆయన వస్తానంటే ఆపేవారు ఎవరూ లేరు. అందుకే ఆయన్ను ఒప్పించడానికి వెలగపూడి సామాజికవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ఒకరు రాయబారం నడుపుతున్నారట. మరి చూడాలి విశాఖ మొత్తం తనవాళ్లే ఉండాలనే జగన్ ఆశ ఎంతవరకు తీరుతుందో.