వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న నిర్ణయాల్లో మూడు రాజధానుల నిర్ణయం చాలా కీలకమైనది. అమరావతి నుండి రాజధానిని తరలించవద్దని అక్కడి రైతులు భారీ ఎత్తున దీక్షలు చేస్తున్నా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పాలన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని ఉండాలని తీర్మానించారు. ప్రతిపక్షాలు ఇది తప్పని అడ్డుపడుతున్నా కూడ జగన్ ఆగట్లేదు. అయితే ఈ మూడు రాజధానుల విషయంలో కేవలం పాలన శాఖలను విశాఖకు తరలించడం మీదనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది కానీ హైకోర్టు విషయంలో మాత్రం జాప్యం చేస్తోంది. కర్నూలును రాజధానిగా చూడాలనేది సీమ ప్రజల దశాబ్దాల కల. ఆ కలను నెరవేరుస్తాను అంటూ కర్నూలు జిల్లాకు హైకోర్టును ప్రతిపాదించారు జగన్.
జగన్ మాటతో రాయలసీమ ప్రజలు ఆనందోత్సాహాల్లోకి వెళ్లిపోయారు. మళ్ళీ కర్నూలుకు రాజధాని కల వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు మొదట్లో హైకోర్టును పెట్టడం మూలాన కర్నాలు అభివృద్ధి చెందేదేమీ ఉండదని చెప్పినా పర్వాలేదు జిల్లాకు రాజధాని హోదా వస్తే చాలని అన్నారు. హైకోర్టును జిల్లాకు తీసుకొస్తున్న జగన్ ను దేవుడిలా చూశారు. రాయలసీమలో జగన్ బలానికి ఎలాంటి ఢోకా లేదు. ఇప్పుడు హైకోర్టును కూడ తీసుకొస్తే అది రెట్టింపవుతుంది. కానీ వద్దని అంటున్న ప్రతిపక్షాలకే చిక్కంతా. ఎవరైతే కర్నూలు రాజధానిగా కావడానికి అడ్డుపడుతున్నారో వారంతా సీమ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. దీంతో ప్రతిపక్షజాలు వెనక్కి తగ్గాయి. కర్నూలులో హైకోర్టు పెట్టే విషయమై ఎవ్వరూ పెద్దగా అడ్డుచేప్పట్లేదు.
సో.. మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత అనుకూలమైన విషయం ఏదైనా ఉంది అంటే అది కర్నూలుకు హైకోర్టును తీసుకెళ్లడం ఒక్కటే. అయినా జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయట్లేదు. నిజానికి హైకోర్టు అనేది రాష్ట్రపతి, సుప్రీం కోర్టు పరిధిలోని అంశం. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే తరలింపు సాధ్యమవుతుంది. ఇదేమంత కష్టమైనా పని కాదు. కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి రాష్ట్రపతి నుండి ఆమోదం తెచ్చుకోవడం జగన్ కు సులువే. అయినా పూనుకోకపోవడంతో సీమ జనంలో అనుమానం మొదలైంది. ప్రకటన చేసి ఇన్నాళ్లు అవుతున్నా ఆ తరలింపు విషయంలో ముందడుగే కనిపించట్లేదని ఆందోళనపడుతున్నారు.
పైగా తాజాగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న సంధించింది. హైకోర్టును కర్నూలుకు తరలించాలని మీరెలా చట్టం చేస్తారని వివరణ అడిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తాము చట్టం చేయలేదని కేవలం కేంద్రాన్ని కోరాలని మాత్రమే తీర్మానం చేశామని చెప్పుకొచ్చారు. ఇలా కేంద్రం నిర్ణయానికి హైకోర్టును వదిలేశామని అంటూ తాము చేసింది ఒట్టి ప్రతిపాదన మాత్రమే అన్నట్టు మాట్లాడటం చూస్తుంటే కర్నూలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే జగన్ పొలిటికల్ కెరీర్లో ఇదే అతి పెద్ద యూటర్న్ అనడంలో సందేహం లేదు.