YS Jagan Knows : 2024 ఎన్నికల్లో కావొచ్చు, అంతకన్నా ముందే కావొచ్చు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, జనసేన పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా వుండబతోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. వాస్తవానికి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ముందుగానే గుర్తించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఎన్నికల్లో జనసేన పార్టీ పది పైసలు కూడా అడ్డగోలుగా ఖర్చుపెట్టదన్న విషయం జనంలోకి వెళ్ళిపోయింది. 2019 ఎన్నికల్లో జనసేన గెలవకపోవడానికీ, ఇప్పుడు ఆ పార్టీ పట్ల జనంలో ఆదరణ పెరగడానికీ అదే కారణం. టీడీపీతో జనసేన కుమ్మక్కయ్యిందంటూ వైసీపీ గగ్గోలు పెడుతోందంటే, జనసేనకు వున్న స్ట్రాంగ్ పవర్ అదే.. ఆ నిజాయితీనే.
మామూలుగా అయితే, రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నాయకుల్ని కొనుక్కోవాలి. వైసీపీ అలాగే టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలను కొనుక్కుంది.. అవసరం లేకపోయినాగానీ. అంతకు ముందు టీడీపీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కుంది. జనసేన అలాంటి ప్రయత్నాలేమీ చేయడంలేదు.
ఖచ్చితంగా జనసేన ప్రభావం వచ్చే ఎన్నికల్లో వుంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రహించారు గనుకనే, జనసేనాని మీద ‘సీబీఎన్ దత్త పుత్రుడు’ అనే నింద మోపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించడం లేదనుకోండి.. అది వేరే సంగతి.
అయినా, పవన్ కళ్యాణ్ ఎందుకు అమ్ముడుపోతారు.? అసలు అమ్ముడు పోవాల్సిన అవసరం ఆయనకేంటి.? అన్నిటికీ మించి, సినీ నటుడిగా కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశమున్నప్పుడు, ఇలా విమర్శలు ఎదుర్కొంటూ రాజకీయాల్లో సంపాదన కోసం పవన్ ఎందుకు వెంటపడతారన్నది సగటు ప్రజానీకంలో జరుగుతున్న చర్చ. ఇదే ఇక్కడే అధికార వైసీపీ ఒకింత ఆందోళన చెందుతోంది. చంద్రబాబు సైతం ఆందోళనకి గురవడం వల్లే, ‘త్యాగం’ అనే మాట తెరపైకి తెస్తున్నారు.