పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకోవడమే వైఎస్ జగన్‌కి మంచిది.!

2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన పార్టీ, ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన పార్టీతో పోటీ పడటమా.? గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పుని ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నట్లున్నారు. బీజేపీపై పోరాటం చేసిన చంద్రబాబు, 2019 ఎన్నికల్లో.. కేవలం ఆ బీజేపీతోనే పోటీ పడినట్లయ్యింది. పలితం కూడా అలాగే వచ్చింది.

మరి, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది.? జనసేనతో పోటీ పడి, ఆ స్థాయికి వైసీపీ సీట్ల పరంగా దిగజారిపోతుందా.? ఔను, గ్రాఫ్ అంతలా పడిపోతుందేమోనన్న ఆందోళన వుందంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ షో చేయడం కొత్తేమీ కాదు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా వున్నప్పుడు చేశారు. జనసేన పార్టీని స్థాపించిన ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చినప్పుడూ అదే షో చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడూ అదే హంగామా. ఇప్పుడూ అదే హంగామా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ నుంచి.

పవన్ కళ్యాణ్ పేరుని తాను ప్రస్తావించడం లేదు కదా.? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నాగానీ, ‘దత్త పుత్రుడు’ అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం వల్ల ఒరిగేదేంటి.? అని వైఎస్ జగన్ తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకోవడమేవ వైఎస్ జగన్‌కి మంచిది. లేదూ, ఆయన్నే ప్రత్యర్థిగా భావిస్తే మాత్రం, టీడీపీ అనుభవం.. రేప్పొద్దున్న వైసీపీకి కూడా ఎదురు కావొచ్చు.