జగన్ ప్రభుత్వం కొలువుదీరాక ఎదుర్కొంటున్న అతి పెద్ద విమర్శలు ప్రత్యేక హోదా సాధన, పోలవరం ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమైందనే మాటను జగన్ తన ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున ఉపయోగించుకున్నారు. చంద్రబాబు బీజేపీతో లాలూచీ పడ్డారని, ఆయనకు హోదా తెచ్చే ఉద్దేశ్యం లేదని, ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అప్పుడే రాష్ట్రం విడిపోయిన బాధలో ఉన్న ప్రజలకు జగన్ మాటలు బాగా చెవికెక్కాయి. అందుకే బాబుగారిని పదవీ భ్రష్టుడ్ని చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే ప్రచారంలో కేంద్రం మెడలు వచ్చాక హోదా తెస్తానన్న జగన్ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. హోదా విషయాన్ని మెల్లగా పక్కనపెట్టేశారు.
అందుకు కారణం మోదీనే. ఆయన చంద్రబాబు నాయుడుకు ఎలాగైతే హ్యాండ్ ఇచ్చారో వైఎస్ జగన్ కు కూడా లాగే ఇచ్చారు. హోదా విషయంలో బాబుగారికి ఇచ్చిన ట్రీట్మెంటే ఇచ్చారు. దాంతో ప్రతిపక్షం మెడలు వంచుతానని సవాల్ చేసిన జగనే మోదీ ముందు వంగిపోయారని, ఇదంతా తన మీదున్న కేసులను మాఫీ చేసుకోవడానికేనని విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. 22మంది ఎంపీలను పెట్టుకుని ఢిల్లీలో పోరాడకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. ఇలా హోదా వివాదంతో ఉక్కిరిబిక్కరి అవుతుండగానే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా జగన్ మీద పోలవరం పిడుగు వచ్చి పడింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వ్యయాన్ని 60 శాతం వరకు తగ్గించేసి 20 వేల కోట్లకు పరిమితం చేసి కొత్త లెక్కలు చెబుతోంది.
హోదా సాధనలో జగన్ ఎలాగైతే బలహీనంగా ఉంటూ వచ్చారో అలాగే పోలవరం విషయంలో కూడ బలహీనంగానే ఉండిపోతున్నారు. రాష్ట్రంలో ఇంత గొడవ జరుగుతున్నా మోదీని పల్లెత్తి మాట అనట్లేదు. చంద్రబాబు నాయుడిదే తప్పంతా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవతల చంద్రబాబు తక్కువ తిన్నవాడేమీ కాదు కదా. అందుకే పోల’వరాన్ని’ జగన్ ప్రభుత్వానికి శాపంగా మార్చే పని స్టార్ట్ చేశారు. జగన్ స్వప్రయోజనాల కోసం హోదాను విస్మరించినట్టు పోలవరాన్ని కూడా విస్మరిస్తున్నారని ఎదురుదాడి స్టార్ట్ చేశారు. జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మోదీతో స్నేహాన్ని వీడి పోలవరాన్ని సాధించి చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు., మరి ఈ డిమాండ్ సాధించడం జగన్ కు అంత సులభమైన విషయం కాదు కదా.