పవన్ కళ్యాణ్ మీద జగన్ విమర్శలు: వైసీపీకి చేటు చేస్తున్నాయా.?

YS Jagan

రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయకపోతే, రాజకీయాల్లో అసలెవరికీ పనీ పాటా వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినాసరే, ‘పనిగట్టుకుని’ రాజకీయ విమర్శలు చేయాల్సిందే. అధికార పక్షమైనా, విపక్షమైనా.. ఎవరూ ఇందుకు అతీతులు కాదు.

మీడియాలో కవరేజ్ కోసమో.. జనాన్ని ఎట్రాక్ట్ చేయడం కోసమో.. తమ వాగ్ధాటిని చాటుకునేందుకు రాజకీయ విమర్శలు చేయడం, రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది. మరి, ఆ రాజకీయ విమర్శల్ని జనం ఎలా తీసుకుంటున్నారు.? ఈ విషయమై మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తుంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీసుకుంటే, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ.. ప్రధాన రాజకీయ పార్టీలు. ఇందులో వైసీపీ – టీడీపీ మధ్యా, వైసీపీ – జనసేన మధ్యా మాటల యుద్ధం చాలా తీవ్రస్థాయిలో జరుగుతుంటుంది. టీడీపీ, జనసేన మధ్య విమర్శలు, బీజేపీ – టీడీపీ మధ్య పంచాయితీ, వైసీపీ మీద బీజేపీ చేసే విమర్శలు.. అవన్నీ వేరే చర్చ.

టీడీపీ మీద వైసీపీ చేసే విమర్శల విషయంలో జనంలో పెద్దగా నెగెటివిటీ ఏమీ కనిపించదు. ఎందుకంటే, టీడీపీ గతంలో అధికారంలో వున్న పార్టీ. ‘నిజమే కదా..’ అనిపిస్తుంటుంది కొన్ని విమర్శల విషయమై. కానీ, జనసేన విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసే విమర్శలే పస లేకుండా పోతున్నాయి.

అధినేత మెప్పు కోసం, జనసేన మీద విమర్శలు చేసే నాయకులు సైతం ఈ విషయంలో తెరవెనుకాల వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వేరేలా వుంటున్నాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే, జనసేన పార్టీని అస్సలు పట్టించుకోకపోవడమే బెటర్. జనసేన మీద వైసీపీ, అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసే ప్రతి విమర్శా, కాపు సమాజంలో వైసీపీ పట్ల వ్యతిరేకతను పెంచుతోందన్నది నిర్వివాదాంశం.