రచ్చవద్దు… మనసుంటే మార్గం ఉంటుంది జగన్!

ఆత్మవిశ్వాసమో.. అతి విశ్వాసమో.. ఈ దఫా వైనాట్ 175 అంటూ ఎన్నికలకు సిద్ధపడుతున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ లను మారుస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సుమారు 20కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చారని తెలుస్తుంది. ఈ సమయంలో జగన్ కు అంగన్ వాడీల నుంచి అతిపెద్ద సమస్య తెరపైకి వచ్చింది. ఈ విషయంలో జగన్ లైట్ తీసుకుంటే జరిగే పరిణామాలు ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తుంది.

ఎన్నికల సీజన్ దగ్గరపడుతుండటంతో జగన్ ప్రధానంగా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించడంపైనే శ్రద్ధ పెట్టారనే కామెంట్లు ప్రధానంగా విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి! దానికి కారణం… సుమారు వారం రోజులకు పైగా అంగన్ వాడీలు రోడ్డెక్కారు. ఇచ్చిన హామీ ప్రకారం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో బ్రతకడం భారం అవుతున్న సమయంలో జీతాలు పెంచాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తుందా అనే చర్చ బలంగా మొదలైంది.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… అంగన్వాడీ ఉద్యోగులందరూ వారం రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలపడం, ఈ సమయంలో వారికి మద్దతు రోజు రోజుకీ పెరుగుతుండటం, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జగన్ సర్కార్ కి ఏమాత్రం మంచిది కాదు! ఈ సమయంలో అంగన్ వాడీలవి గొంతమ్మ కోర్కెలుగా ప్రభుత్వం భావించకూడదు. అవ్వాతాతలకిచ్చే పెన్షన్ ని ప్రభుత్వం 3వేల రూపాయలకు పెంచిన నిష్పత్తిలోనే తమకు కూడా జీతాలు పెరగాలన్నట్లుగా మాత్రమే వారు కోరుతున్నారు.

ఇది ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంత పెద్ద సమస్య అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఇది అతిసున్నితమైన సమస్య అనే విషయం మాత్రం మరిచిపోకూడదు. సుమారు లక్ష కుటుంబాలపై ఈ ఎఫెక్ట్ పడనుందని జగన్ సర్కార్ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు.. వారి వారి కుటుంబ సభ్యుల ఆగ్రహం వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పై పడితే… సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

మరోపక్క అంగన్ వాడీల విషయాన్ని విపక్షాలు పూర్తిగా క్యాష్ చేసుకునే పనులకు శ్రీకారం చుట్టలేదు. వాస్తవానికి ఈపాటికి టీడీపీ నేతలు, జనసేన నేతలు… అంగన్ వాడీలతో కలిసి రంగంలోకి దిగాలి. అయితే వారు రంగంలోకి దిగిన అనంతరం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడానికంటే ముందే… అంగన్ వాడీల విషయంలో తెగేదాకా లాగకుండా ఒక సామరస్య పూర్వక నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిదని సూచిస్తున్నారు పరిశీలకులు.