అసలుకు లేదు కానీ 30 ఏళ్ళు సిఎం అట

మొదటిసారి 2014లో ముఖ్యమంత్రి కుర్చి వెంట్రుకవాసిలో తప్పిపోయింది. రెండో అవకాశం అంటే 2019లో కూడా సిఎం కుర్చీలో కూర్చుంటారో లేదో తెలీదు. అప్పుడే 30 ఏళ్ళపాటు ముఖ్యమంత్రి పదవికి గురిపెట్టారు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో తానే ఉంటానని చెబుతున్నారు. ఇదంతా ఎవరి గురించో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈపాటికే అర్ధమైపోయుంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే అని.   ప్రజలు ఆశీర్వదిస్తే జగనే అనేముంది ? ఎవరైనా సరే కూర్చుంటారు.

 

పశ్చిమబెంగల్లో జ్యోతిబసు, త్రిపురలో మొన్నటి వరకూ మాణిక్ సర్కార్ కూడా ఏకధాటిగా రెండు దశాబ్దాల పాటు సిఎం కుర్చీలో కూర్చున్నారు. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాల్లో మరికొన్ని చోట్ల కూడా మరికొందరు ముఖ్యమంత్రి పదవిలో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏపి విషయానికి వస్తే చంద్రబాబునాయుడు కూడా 2050 వరకూ టిడిపినే అధికారంలో ఉండాలని చాలాసార్లు బహిరంగంగానే తన కోరికను వ్యక్తం చేశారు. సిఎం అవ్వాలని, సిఎం కుర్చీకే అతుక్కుపోవాలని కోరిక ఉండని వారెవ్వరు ?

 

ప్రస్తుత విషయానికి వస్తే విజయనగరం జిల్లా గజపతినగరంలో పాదయాత్ర సందర్భంగా జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రజలు ఆశీస్సులుంటే రాబోయే 30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ చెప్పటంతో అత్యాసే కనబడుతోంది. ఎందుకంటే బతికినంత కాలం తానే సిఎంగా ఉండాలని కుర్చీలో కూర్చున్నవారు ఎవరైనా కోరుకోవటం సహజం. కానీ అసలు మొదటిసారి అధికారంలోకి రావాలి కదా ? ఇక్కడ జగన్ కు కూడా ఇదే వర్తిస్తుంది.

 

2014లోనే జగన్ సిఎం అవుతారని చాలామంది అనుకున్నారు.  కానీ అవకాశం తృటిలో తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది ? ఎందుకంటే, జగన్ స్వయంకృతమనే చెప్పక తప్పదు. వ్యూహాల్లో తప్పిదాల వల్లే అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం లేనికారణంగానే అధికారం మిస్సయింది. మరి రేపటి ఎన్నికల్లో ఏమవుతుంది ? అంటే ఇపుడే చెప్పలేం. పోయిన సారి జగన్ చేసిన తప్పుల్లాంటివే ఇపుడు చంద్రబాబు కూడా చేస్తే కాలం కలిసివచ్చి జగన్ సిఎం అవుతారు. నిజానికి 30 ఏళ్ళుగా సిఎంగా ఉండాలని కోరుకో అక్కర్లేదు. అధికారంలోకి వస్తే,  జగన్ పరిపాలనను మెచ్చితే సుదీర్ఘకాలం కుర్చీలో కొనసాగే అవకాశం జనాలే ఇస్తారు.