చంద్రబాబుపై అటు బూతులు.. ఇటు నమస్కారాలు.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద వైసీపీ నేతలు కొందరు బూతులతో విరుచుకుపడుతున్న వైనం, పార్టీలోనే ఇంకొందరికి నచ్చడంలేదా.? అంటే, అవుననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే, బాధితుల్ని ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. అలా వరద సహాయ కార్యక్రమాల్లో చెవిరెడ్డి పాల్గొంటున్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కూడా జరిగింది.

అటువైపుగా చంద్రబాబు కాన్వాయ్ వెళుతుందని తెలిసి, మామూలుగా అయితే వైసీపీ నేతలు ఇంకో వైపు మళ్ళడం అనేది జరుగుతుంటుంది. కానీ, అప్పటిదాకా అక్కడే వున్న చెవిరెడ్డి, కూర్చున్న స్థానం నుంచి కిందికి దిగి, చంద్రబాబుకి రెండు చేతులతోనూ మర్యాదపూర్వకంగా నమస్కరించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

వాస్తవానికి ఈ సంఘటన జరిగినప్పుడు అంతా లైట్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడం సహజమే. అయితే, వైసీపీలోనే ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

‘జరిగిన ఘటనను బూతద్ధంలో చూడాల్సిన పనిలేదు.. అది మా నేతల సంస్కారం..’ అని వైసీపీలో కొందరంటున్నారు. అదే సమయంలో, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ..’ అనే స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీలో కొందరికి ఝలక్ ఇచ్చారన్న చర్చ తెరపైకొచ్చింది.

చెవిరెడ్డి నుంచి వైసీపీ అధిష్టానం ఈ అంశంపై వివరణ కోరిందన్న ప్రచారంతో, చెవిరెడ్డి మద్దతుదారుల్లో అలజడి రేగింది. అయితే, అదంతా ఉత్తదేననీ, ఈ విషయాన్ని సాకుగా చూపి వైసీపీలో అలజడికి టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నిస్తోందన్నది వైసీపీలో ఓ వర్గం ఆరోపణ.

చంద్రబాబు మీద బూతులతో విరుచుకుపడే ఓ వర్గం, ఆ వర్గానికి వ్యతిరేకంగా ఇంకో వర్గం.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలకు తెరలేపాయంటూ జరుగుతోన్న ప్రచారంలో నిజమెంత.? ఈ వ్యవహారంపై చెవిరెడ్డి ఏం చెబుతారు.?