అచ్చెన్నాయుడిని నడి రోడ్డు మీద కొడతా: వైసీపీ నేత దువ్వాడ.!

YCP Leader

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా.? లేదా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మంత్రిగా గతంలో పని చేసిన వైసీపీ నేత కొడాలి నాని, అప్పుడూ ఇప్పుడూ తన నోటికి హద్దూ అదుపూ లేకుండానే మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.

తాజాగా ఈ లిస్టులో మరో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కూడా చేరిపోయారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నడు రోడ్డు మీద కొట్టుకుంటూ పరుగులు పెట్టిస్తానంటూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. అయితే, ఆ విమర్శలు మరీ హద్దులు దాటేస్తున్నాయి.

అధికార పార్టీ నేతలు గనుక, పోలీసుల మీద చెయ్యి చేసుకునేదాకా వెళ్ళినా.. కొందరి విషయంలో పోలీస్ వ్యవస్థ ఏమీ చేయలేకపోతోంది. విశాఖలో సీదిరి అప్పలరాజు ఓ పోలీస్ అధికారితో దురుసుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పేర్ని నాని కూడా ఇలాగే మంత్రిగా వున్న సమయంలో పోలీస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు.

పోలీస్ అధికారుల మీదనే చెలరేగిపోతున్న వైసీపీ నేతలకి, విపక్ష నేతలపై విరుచుకుపడటం, దాడులు చేయడంలో వింతేముంది.? దువ్వాడ శ్రీనివాస్ అయితే, ఏకంగా ఆత్మాహుతి దళం.. అనే స్థాయికి వెళ్ళారు. గతంలో ఇవే తరహా వ్యాఖ్యలు టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేశారు. వెరసి, వైసీపీ అలాగే టీడీపీ కలిసి.. రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్న అనుమానం కలుగుతోంది.

రాజకీయాలన్నాక విమర్శలు చేసుకోవడం రాజకీయ నాయకులకు తప్పు కాకపోవచ్చు. కానీ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, ప్రకటనలు వుండకూడదు. రాజకీయ ప్రత్యర్థులపై పేలే మాటల తూటాలు, జనాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయని అధికార పక్ష నేతలు, విపక్షాల నేతలూ తెలుసుకోవాలి.