వైసీపీ కాపు నేతలకు జనసేన సెగ గట్టిగానే తగులుతోందా.?

వైసీపీ కాపు నేతలు తాజాగా రాజమండ్రిలో భేటీ నిర్వహించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. వైసీపీ హయాంలోనే కాపు సామాజిక వర్గానికి న్యాయం జరుగుతోందని కూడా చెప్పుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సహా వైసీపీ కాపు నేతలు చాలామంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇంకోపక్క, గోదావరి జిల్లాల్లో (ఉమ్మడి గోదావరి జిల్లాలు) కాపు యువత, వైసీపీ కాపు నేతలకు వ్యతిరేకంగా చిన్నపాటి ఆందోళనా కార్యక్రమాల్ని నిర్వహించాయి. ‘కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాబోతోంది.. దాన్ని మీరు చెడగొట్టొద్దు.. చేతనైతే జనసేనకు సహకరించండి.. అంతేగానీ, జనసేనాని మీద విమర్శలు చేయొద్దు..’ అన్నది సదరు ఆందోళనలు చేస్తున్నవారి స్వీట్ వార్నింగ్.

జనసేన మద్దతుదారులే ఈ ఆందోళనలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే, ఆయా ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గ పెద్దల నుంచి ఈ ఆందోళనలకు మద్దతు బలంగానే వచ్చినట్లు వైసీపీ కాపు నేతలకు సమాచారం అందింది.

ప్రధానంగా కొన్నాళ్ళ క్రితం కోనసీమ జిల్లా వివాదం విషయమై మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టిన క్రమంలో కాపు సామాజిక వర్గం టార్గెట్ అయ్యిందనే భావన ఆ సామాజిక వర్గ ప్రముఖుల్లో వుంది. అప్పటినుంచి కాపు సామాజిక వర్గంలో కొంత అలజడి అయితే షురూ అయ్యింది.

‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్న భావన గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో బలపడుతోంది. పైకి, జనసేనాని మీద విమర్శలు, వైఎస్ జగన్ మీద ప్రశంసలతో కాపు నేతలు సరిపెట్టినా, కిందిస్థాయిలో పరిణామాల పట్ల వైసీపీ కాపు నేతలు ఆందోళన చెందుతున్నారట. ఆ విషయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ కాపు నేతలు తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది.