చంద్రబాబు కడప కల నెరవేరుతుందా?

 

(యనమల నాగిరెడ్డి)

కడప జిల్లాను కభళించాలన్నది చంద్రబాబు కల. 2014లో నాయుడిగారి టిడిపి ఘోరంగాపరాజయం పాలయింది. గెల్చుకున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యేని. 2019 తర్వాతనైనా కడపలో పచ్చ జెండా ఎగరేయాలన్నది ఆయన ఆశ. వీలుంటే పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకోవాలన్నది అత్యాశ. దీనికోసం బాబు,చిన్నబాబు  కడప చుట్టూర      ఎన్ని సార్లు  తిరిగారో, ఎన్ని ఎత్తులేస్తున్నారో లెక్కేలేదు. పార్టీని బలోపేతం చేయడానికి ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఒక ఎమ్మెల్సీని గెల్చుకున్నారు. అయినా, ఆయినా కడప కల నెరవేరేలా కనిపించడం లేదంటున్నారు సీనియర్ జర్నలిస్టు నాగిరెడ్డి. చంద్రబాబు కడప కలవరం మీద ఒక విశ్లేషణ

 

వైస్సార్ పార్టీ అధినేత, ప్రతిపక్షనాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వంత జిల్లా కడప.  రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన కడప జిల్లాలో తెలుగుదేశం పాగా వేసి పట్టు నిలుపుకోడానికి గత నాలుగు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్త్తున్నా ఫలితంమాత్రం దక్కడం లేదు. జిల్లా  టీడీపీ నాయకులను  ఏకోన్ముఖం చేసి  పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా వారు తీస్తున్నకడప సమైఖ్యతా రాగం ఏమాత్రం ఫలించడం లేదని చెప్పక తప్పదు.

ఏపార్టీ నుంచి వచ్చితమ పార్టీలో చేరినా, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీకి చిందిన వారెవరైనా టీడీపీలో చేరితే తమ బలం పెరిగి జగన్ బలహీనపడతాడని, తద్వారా టీడీపీని  జిల్లాలో  బలమైన శక్తిగా తయారుచేయవచ్చునని ముఖ్యమంత్రి ఆశించారు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించారు.  వారికి పెద్ద పీట  వేశారు కూడా. అలా టీడీపీలో చేరిన వారిని, తమపార్టీకి చెందిన పాత కాపులను ఒక్కటిగా చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు కూడా.    

  నాయకులు ఎవరంతకు వారే తమ అస్తిత్వం నిలుపుకొని, ప్రాభల్యం పెంచుకోడానికి ప్రయత్నించడం, రెండు వర్గాల నాయకులు పైకి ఒక్కటిగా కనిపించినాయధాశక్తి తమదైన శైలిలో తమ పనిచేసుకుంటూ పోవడం“,  వారి అనుచరులు మాత్రం పూర్వ విభేదాలను మరచిపోలేక పోవడం లాంటి కారణాలు పార్టీలో విభేదాలను పెంచి పోషిస్తున్నాయి .    నేపద్యంలో  పార్టీ శ్రేణులను, అందరు నాయకులను ఒక్కటిగా చేసి (ఒకే ఒరలో రెండు కత్తులను పెట్టి ) జిల్లాలో  జగన్ ను ధీటుగా ఎదుర్కోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చేసిన అన్ని ప్రయత్నాలు, నిర్వహించిన సమావేశాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదని చెప్పక తప్పదు.  

పేట్రేగిన టీడీపీ  నాయకుల విభేదాలు

జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలోని నాయకులలోను విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. నియాజకవర్గంలో కూడా ఏక నాయకత్యం (సమిష్టి నాయకత్యం) లేకపోవడం జిల్లాలో టీడీపీ దీనస్థితికి కారణభూతమైంది.

రాజంపేట

జిల్లాలో 2014లో టీడీపీ గెలిచిన  ఏకైక స్థానం రాజంపేట. టీడీపీ విప్ గా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలో తనకు తగిన స్థానం లేదన్న కారణంతో పాటు, కుటుంబపరమైన కారణాలతో  పార్టీ మారనున్నాడనే  వార్తలు వినిపిస్తున్న నేపద్యములో తాను గెలిచిన ఏకైక స్థానానికే  టీడీపీ అభ్యర్థి కొరతను ఎదుర్కొంటున్నది. మేడా పార్టీ మారితే టీడీపీ కొత్త అభ్యర్థి  వేట సాగించక తప్పదు.

పులివెందుల

ఇకపోతే వైస్సార్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  జగన్ మోహన్ రెడ్డి స్వంత నియాజకవర్గం పులివెందులలో ఆయన తండ్రి  వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి  ధీటైన అభ్యర్థి కోసం గత అనేక సంవత్సరాలుగా టీడీపీ ప్రయత్నిస్తున్నది. అయితే ఒక్కసారి కూడా అక్కడ గెలుపు సాధ్యం కాలేదు. 2019 ఎన్నికలలోనైనా ధీటైన అభ్యర్థిని రంగంలో దించి జగన్ దూకుడుకు కళ్లెం వేయాలనేది దేశం వూహ్యం.  ఇందులో భాగంగానే చంద్రబాబు కృష్ణా జలాలను పులివెందుల ప్రాంతానికి తరలించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి పేరు బలంగా విన్పిస్తుండగా, ఎమ్మెల్సీ బీటెక్ రవి, శిక్షణా  కార్య క్రమాల పర్యవేక్షకుడు రాంగోపాల్ రెడ్డి క్యూలో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. ఐతే  సతీష్ రెడ్డి మాత్రమే ఒకరకమైన పోటీ ఇవ్వగలడనేది పరిశీలకుల అభిప్రాయం.

ప్రొద్దటూరు

జిల్లా టీడీపీ లో రావణ కాష్టంలా  రగులుతున్న ప్రొద్దటూరులో నాయకుల మధ్య ఐక్యత మాట దేవుడెరుగు. బహిరంగ  పోరు తారాస్థాయిలో ఉంది. మాజీ శాసన సభ్యుడు వరదరాజులు రెడ్డి నియాజకవర్గ పార్టీ ఇంఛార్జిగా ఉన్నారు. ఆయనకు మరో మాజీ ఎంయల్ లింగా రెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. నియాజకవర్గంలో వీరితో పాటు ఎంపీ సి.ఎం. రమేష్ తన ఆధిపత్యాన్ని నిలుపుకోడానికి తన సోదరుడు సురేష్ ను రంగం లోకి దించారు. వీరికి తోడు మునిసిపల్ వైస్ చైర్మన్ ముక్తియార్ కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆప్కో చైర్మన్ గజ్జల శీనును రంగంలోకి దించడానికి రమేష్ పావులు కడుపుతున్నారనేది కొసమెరుపు.

జమ్ములమడుగు

గత కొన్ని దశాబ్దాలుగా వర్గ పోరుతో నలుగుతూ అనేకమంది కుటుంభ సభ్యులను, అనుచరులను ఫ్యాక్షన్ భూతానికి బలిపెట్టి జమ్ములమడుగు నియాజకవర్గంలో తమదైన ముద్ర వేసిన  రెండు వర్గాలు (కత్తులు) ప్రస్తుతం ఒకేఒరలో ఉన్నాయి. పార్టీని నమ్ముకుని ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీలోనే కొనసాగుతున్న ఎం ఎల్ సి రామసుబ్బారెడ్డి ఒక వర్గ నాయకుడు కాగా,  జిల్లాలో జగన్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి, తమ అస్తిత్వాన్ని కాపాడుకోడానికి వైస్సార్ పార్టీ నుంచి టీడీపీలో చేరి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి మరోవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇరువురు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే  పార్టీలో చేరినప్పటి నుంచి తనదైన శైలిలో పనిచేస్తూ ఎం ఎల్ సి ఎన్నికలలో చక్రం తిప్పి జగన్ చిన్నాన్న వై.యస్. వివేకానంద రెడ్డిని ఓడించడం, ఆళ్లగడ్డ ఉప ఎన్నికల తనదైన శైలిలో పోల్ మానేజ్మెంట్ చేయడం లాంటి అంశాలు ఆదినారాయణ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. నాయకులు కలిసినట్లు కనిపించినా క్రింది స్థాయిలో వర్గ పోరులో నలిగిన కార్యకర్తలు ఏకం కాగలరా  అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.  వీరిరువురిలో ఎవరికీ టికెట్ ఇచ్చినా అభ్యర్థికి, టీడీపీ అధినేతకు తలనొప్పి తప్పదని పరిశీలకుల అంచనా .

మైదుకూరు

ఇకపోతే మైదుకూరు నివాసి గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన   రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు,  ప్రస్తుతం టీటీడీ చైర్మనుగా ఉన్న పుట్టా సుధాకర యాదవ్  మైదుకూరు నియాజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. నియాజకవర్గానికే చెందిన మాజీ మంత్రి  డి . ఎల్.  రవీంద్ర రెడ్డి కూడా ఎన్నికల రేసులో ఉన్నారు. ఆయన ప్రస్తుతం గోడమీద మాత్రమే ఉండి వైస్సార్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒకవేళ అక్కడ టికెట్ రాకపోతే టీడీపీ తరపున రంగంలోకి దిగలనుకుంటున్నారు .

బద్వేల్, కోడూరు

యస్. సి లకు కేటాయించిన బద్వేల్, కోడూరు నియాజకవర్గాలలో అక్కడున్న అగ్రవర్ణాల నాయకత్యం సూచనల మేరకు పార్టీ టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తున్నది. బద్వేల్ నియాజకవర్గంలో మాజీ మంత్రి వీరారెడ్డి కుమార్తె విజయమ్మ ఒక వర్గానికి, గతంలో ఎం. ఎల్. అభ్యర్థిగా   ఉన్న విజయ జ్యోతికి   సత్సంబంధాలు లేవని, వారి మధ్య ఆధిపత్య పోరు  కొనసాగుతున్నదనేది బహిరంగ రహస్యమే.

అలాగే కోడూరు నియాజకవర్గంలో కుడా వర్గ పోరు కొనసాగుతున్నది. పార్టీ పాత కాపు విశ్వనాధనాయుడు, మరో సీనియర్ నాయకుడు కట్టా  నారాయణ నాయుడి కుమారుడు  కట్టా బాలాజి, ఎం.ఎల్.సి చెంగల్రాయుడు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.

రెండు నియాజకవర్గాలలో యస్. సి. వర్గాలకు చెందిన బలమైన నాయకుడు లేకపోవడంతో  బడా నాయకుల సూచనలకు అనుగుణంగానే అబ్యర్థుల ఎంపిక జరగవలసి ఉంది.  మరి నాయకుడి అనుచరుడికి టికెట్ ఇస్తే మిగిలిన నాయకులను స్వాంతన పరచి పార్టీ గెలుపుకు ఎలా  కృషి   చేయగలరో వేచి చూడాల్సిందే.        

కమలాపురం

ఇకపోతే జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండి అనేక ఉద్యమాలకు, రాజకీయ పరిణామాలకు వేదికగా ఉన్న కమలాపురం నియాజకవర్గంలో కూడా  పార్టీ టికెట్ కు బలమైన పోటీ ఉంది. ప్రస్తుతంనియాజకవర్గానికి  వైస్సార్ పార్టీ ఎం.ఎల్. గా , రాజశేఖర్ రెడ్డి బావమరిది, జగన్ మేనమామ రవీంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవీంద్రా రెడ్డిని ఓడించి జగన్ ఆధిపత్యానికి కొంత మేరకైనా చెక్ చెప్పడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే టీడీపీ టికెట్ రేసులో ఇరువురు బలమైన నాయకులు,  టీడీపీ మాజీ ఎం.ఎల్.  వీరశివా రెడ్డి, గత ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పుత్తా  నరసింహ రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరికీ టికెట్ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి  అన్నది అధినాయకత్యానికున్న సమస్య.    

రాయచోటి

రాయచోటి నియాజకవర్గం విషయానికి వస్తే మాజీ ఎం.ఎల్., నియాజకవర్గ టీడీపీ ఇంచార్జి రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎం.ఎల్. పాలకొండ్రాయుడి కుమారుడు ప్రసాదబాబు ప్రధానోగా టికెట్ రేసులో ఉన్నారు. అయితే  వీరిరువురి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి  ఉంది.వీరిరువురు  ఏకమై పార్టీ అభ్యర్థి   కోసం పనిచేస్తారనేది సందేహాస్పదమే.

 వైస్సార్ పార్టీ వ్యూహకర్త ఎం. పి  విజయసాయి రెడ్డి బావమరిది, ప్రస్తుత వైస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి సమీప బంధువు   నియాజకవర్గంలోనే ఉన్న మరో మాజీ ఎం.ఎల్. ద్వారకనాథ రెడ్డి ఎన్నికల బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన రెండు పార్టీలలో పార్టీ టికెట్ పైనైనా పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు.

కడప

జిల్లా  కేంద్రంమైన కడప  ముస్లింల కంచు కోటగా ఉంది. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య  అధికంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిఓడిపోయిన  దుర్గా ప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, అమీర్ బాషా , సుభాన్ బాషా లాంటి పాతకాపులు టికెట్ ఆశిస్తున్నారు. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు  శ్రీనివాసులు రెడ్డి కుడా టికెట్ ఆశిస్తున్నారని  పార్టీ వర్గాల సమాచారం.వీరిలో ఎవరికీ టికెట్ లభించినా మిగిలిన వారి మద్దతు ఎంత అన్నది ప్రశ్నార్థకమే . వీరందరినిమించిన ఘనాపాటి మరొకరు కూడా  రంగంలో ఉండనున్నారన్న వార్తలుకూడా వినిపిస్తున్నాయి.  

2014 లో జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం కడప జిల్లాలోని  పది శాసనసభా స్థానాలలో కేవలం రాజంపేట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగా మిగిలిన 9 స్థానాలలో వైస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తర్వాత టీడీపీ అధినేత  ఆపరేషన్ ఆకర్ష పేరుతొ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన జమ్మలమడుగు, బద్వేలు  శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, జయరాములును   పార్టీలో చేర్చుకున్నా, ఎమ్మెల్సీ ఎన్నికలలో సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డిని ఓడించి సత్తా  చాటుకున్నా, ముఖ్యమంత్రి ఆశించిన మేరకు స్థానిక టీడీపీ  నాయకత్వం జిల్లా రాజకీయాలలోపట్టు సాధించడంలో మాత్రం విఫలమైందని చెప్పక తప్పదు. అలాగే ముఖ్యమంత్రి ఎంత మద్దతు పలికినా నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి, కార్యకర్తలను ఏకోన్ముఖంగా నడిపించడంలోనూ జిల్లా నాయకత్వం విఫలమైందని చెప్పవచ్చు.  

పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, నాయకుల అధికార దాహం , తమ ప్రాభల్యం పెంచుకోవాలన్న బడా నేతల తపన  కడప జిల్లాలో టీడీపీని అతలాకుతలం చేస్తున్నాయి. అలాగే పార్టీ పరిస్థితిని, ప్రతిష్టను  నానాటికి దిగజారుస్తున్నాయని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొన్న కార్యకర్తలు వాపోతున్నారు.  ముఖ్యమంత్రి ఇప్పటికైనా జిల్లాపై దృష్టిని కేంద్రీకరిస్తే తప్ప పార్టీ స్థితి మెరుగుపడే అవకాశం లేదని, ఆయన వర్గ పోరుపై కఠినంగా వ్యవహరించకుండా అలసత్వం ప్రదర్శిస్తే జిల్లాలో పార్టీ అదృశ్యం అవుతుందని వారు వాపోతున్నారు.  

నారా వారు దేశం పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించి  వైస్సార్ పార్టీకి ధీటైన పోటీగా నిలుపుతారా లేక అస్తిత్వం కోసమే పోరాడతారా అన్నది ఎన్నికలనాటికి మాత్రమే తెలగలదు.