టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవమానభారంతో మహిళా ఎంపిపి తిరుగుబాటు

కొందరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని స్థానిక ప్రజా ప్రతినిధులను గౌరవించడంలేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోకల్ లీడర్లు ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీలో సుమారు డజన్ మంది ఎమ్మెల్యేలు నిత్యం వివాదాల్లో చిక్కుకున్నారు. వారిలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. ఆయనపై గతంలో మనుగోడు నియోజకవర్గ కేంద్రం సర్పంచ్ తిరుగుబాటు చేయగా తాజాగా ఆయన నియోజకవర్గంలోని నాంపల్లి మండల మహిళా ఎంపిపి దుండిగ నాగమణి తిరుగుబాటు చేశారు. అయితే ప్రొటోకాల్ విషయంలో ఆమెను మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఘోరంగా అవమానించారు. దీంతో ఆమె పోరుబాటు పట్టారు. ఈ పరిణామం టిఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫుల్ స్టోరీ చదవండి. నాగమణి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి చూడండి.

నల్లగొండ జిల్లా నాంపల్లి ఎంపీపీ దుండిగ నాగమణి అంబేద్కర్ విగ్రహాం ముందు నిరసన దీక్షకు దిగారు. నాంపల్లి ఎంపీపీగా ఉన్న నాగమణి… ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యక్రమాల ప్రారంభంలో తనను అవమానాలకు గురిచేస్తున్నారన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి పిలిచి తనతో కాకుండా జడ్పీటీసీ భర్త రవీందర్  రెడ్డితో ప్రారంభించి తనను అవమాన పరిచారని ఆమె తెలిపారు. ప్రోటోకాల్ విషయమై మండల పరిషత్ అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఎంపీపీ అయిన తనకు కనీస గౌరవం ఇవ్వటం లేదని ఆమె వాపోయారు. బహుజనులమనే కారణంతోనే ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని, ఎమ్మెల్యేో తన వైఖరి మార్చుకోవాలని ఆమె అన్నారు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కలిసి పనిచేయాలని లేనిచో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.

ఇదే విషయంపై ఎంపీపీ దుండిగ నాగమణి “తెలుగురాజ్యం”తో మాట్లాడారు. 2014లో తాము వేనేపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి నుంచి టిఆర్ ఎస్ లో చేరామని చెప్పారు. వెంకటేశ్వరరావుకు, ఎమ్మెల్యే కు విబేధాలు రావడంతో తమను వెంకటేశ్వరరావు మనుషులుగా ముద్రవేసి తమపై కక్ష్యపూరితంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు. తాము ఎంపీపీగా ఎన్నికైనప్పటి నుంచి తమపై వ్యతిరేకత భావంతోనే ఎమ్మెల్యే చూస్తున్నారని ఆమె వాపోయారు. స్వంత పార్టీ కావడంతో విబేధాలు వస్తే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఇన్నాళ్లు తాము ఓపికగా వ్యవహరించామని చెప్పారు. ఇక ఎమ్మెల్యే విధానాలను తట్టుకోలేక ఆందోళనకు సిద్దమయ్యామని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తమతో కలిసి వస్తే తాము పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని ఆమె తెలుగురాజ్యంతో తెలిపారు. ఎంపీపీ నాగమణి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

గతంలో కూడా ఎమ్మెల్యే పై పలువురు ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేశారు. మునుగోడు సర్పంచ్ పందుల నర్సింహ్మకు కూడా ఎమ్మెల్యే కనీస విలువ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే చౌటుప్పల్ సర్పంచ్ లావణ్యజంగయ్యగౌడ్, నారాయణపురం జడ్పీటీసీ బొల్ల శివశంకర్ ల పట్ల కూడా ఎమ్మెల్యే ఈ రకంగానే వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై ఇప్పటికే వ్యతిరేకత ఉంది. సీఎం కేసీఆర్ తయారు చేసిన హిట్ లిస్టు జాబితాలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఉందని బహిరంగంగానే నేతలు తెలిపారు. గట్టప్పల్ మండల ఏర్పాటు ఆగిన దగ్గరి నుంచి ఎమ్మెల్యేపై విమర్శలు వచ్చాయి. ప్రజలలో ఉండడు, ప్రజలకు సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాడనే పేరు ఎమ్మెల్యేకు ఉందని సొంత పార్టీ నేతలే అన్నారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు కూడా లేవని వారు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎంపీపీకి కనీస ప్రొటోకాల్ పాటించకపోవడం మరో వివాదానికి దారితీసింది. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై మరోసారీ వ్యతిరేకత ఎదురైంది. ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుందో అని మునుగోడు నియోజకవర్గంలో అంతా చర్చించుకుంటున్నారు.