వీడియో: నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్‌లో అగ్నికీల‌లు

ఏటా క‌న్నుల పండువ‌గా ఏర్పాట‌య్యే నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్ వ‌ల్ల మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో సంఘ‌ట‌నాస్థ‌లంలో సుమారు 25 వేల మందికి పైగా సంద‌ర్శ‌కులు ఉన్న‌ట్లు అంచ‌నా. మంట‌లు చెల‌రేగ‌గానే వారంద‌రూ భీతావ‌హులై ప‌రుగులు తీశారు.

మొద‌ట ఆంధ్రాబ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్‌లో షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల మంట‌లు చెల‌రేగాయ‌ని, క్ర‌మంగా ఇత‌ర స్టాళ్లకు వ్యాపించాయ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. మంట‌లు చెల‌రేగ‌డం, స్టాళ్లు అహూతి కావ‌డం వ‌ల్ల వెలువడిన‌ దట్టమైన పొగల వ‌ల్ల ప‌లువురు సంద‌ర్శ‌కులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ సమాచారం అందుకున్న వెంట‌నే అయిదు అగ్నిమాపక వాహ‌నాలు సంఘ‌ట‌నాస్థ‌లానిక చేరుక‌న్నాయి. మంటలను అదుపుచేస్తున్నాయి.

25 వేల మందికి పైగా ఉన్న సంద‌ర్శ‌కులు ఒకేసారి భ‌యంతో రోడ్డు మీదికి ప‌రుగులు తీయ‌డంతో స్వ‌ల్పంగా తొక్కిస‌లాట చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.