నాంపల్లి ఎగ్జిబిషన్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులకు పెను విషాదాన్ని మిగిల్చింది. మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్‌ల నుంచి వచ్చిన వ్యాపారులు ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయారు. ఆయా రాష్ట్రాల వ్యాపారులు నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లన్నీ మంటలకు అహూతి అయ్యాయి.
తాము ఎన్నో ఆశలతో లక్షలాది రూపాలయ విలువ చేసే దుస్తులు, ఇతర సామాగ్రిని స్టాళ్లలో ఉంచామని, అవన్నీ బుగ్గి అయ్యాయని బాధితులు వాపోతున్నారు. జమ్మూకు చెందిన సర్దార్ నాజిర్ అలీ ఖాన్ అనే వ్యాపారి తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు వెల్లడించారు.
తాను ఏర్పాటు చేసిన శాలువాలు, ఇతర కాశ్మీరీ వస్తువల స్టాళ్లు మంటల్లో మసి అయిపోయాయని చెప్పారు. తమను ఆదుకోవాలని ఆయన కోరారు. దీనికి ఒమర్ అబ్దుల్లా వెంటనే స్పందించారు. బాధితులను ఆదుకోవాలని కోరుతూ ఆయన కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, బాధితులకు న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.