తెలంగాణపై వైఎస్సార్సీపీ ఫోకస్ పెడుతుందా.? షర్మిల సంగతేంటి.?

తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీయార్ భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన దరిమిలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగైదు లోక్ సభ నియోజకవర్గాలపై కేసీయార్ కన్నేశారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత సీన్ కేసీయార్‌కి ఏపీలో వుంటుందా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

కేసీయార్, ఆంధ్రప్రదేశ్ మీద కన్నేయడం కాదు.. ఆంధ్రా పార్టీలుగా కేసీయార్ ముద్ర వేసిన టీడీపీ, వైసీపీ ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నాయి. జనసేన పార్టీకి సైతం తెలంగాణలో బలం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల ప్రభావం ఖచ్చితంగా వుండబోతోందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మంచి బేస్ వుండేది. వైసీపీ సంగతి సరే సరి.! జనసేన పార్టీనే ఇంకా తెలంగాణలో ప్రూవ్ చేసుకోవాల్సి వుంది. వైసీపీ గతంలో తెలంగాణలో ఓ ఎంపీ సీటునీ, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్నీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అవన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనే.

తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే, తెలంగాణలో అన్ని చోట్లలా ఆ పార్టీకి ఇప్పటికీ హార్డ్‌కోర్ అభిమానులున్నారు. టీడీపీ సంగతి పక్కన పెడితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరిగి తన పూర్వ వైభవాన్ని కాపాడుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్నది తెలంగాణలో వైసీపీ అభిమానుల వాదన.

అయితే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ రూపంలో వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తున్న దరిమిలా, వైసీపీకి తెలంగాణలో మళ్ళీ తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం వుండకపోవచ్చు. కానీ, వైఎస్సార్టీపీ కంటే, వైఎస్సార్సీపీనే మేలన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ జెండా మీద కేసీయార్ తమ అభ్యర్థుల్ని నిలబెడితే, వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖమ్మం ఎంపీ సీటుని ఆమె సులువుగా గెలుచుకోవడానికి వైసీపీ జెండా దోహదపడుతుంది.