జగన్ ఏమైనా సాధించగలరా ?

పెట్టుబడుల ఆకర్షణ కోసం జగన్మోహన్ రెడ్డి డిప్లమాటిక్ ఔటరీచ్ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం విజయవాడలో జరగనున్న  ఈ సదస్సుకు దాదాపు 35 దేశాల నుండి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. వీళ్ళతో పాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ సదస్సుకు ఆహ్వానించారు. 

పెట్టుబడుల కోసం సదస్సు అంటేనే రాష్ట్రంలో జనాలు నమ్మే పరిస్ధితి పోయింది. జనాల్లో ఈ అభిప్రాయం బలపడటానికి చంద్రబాబునాయుడే కారణం. ఐదేళ్ళ అధికారంలో నాలుగు సంవత్సరాలు విశాఖపట్నం కేంద్రంగా ఇటువంటి డ్రామాలు చంద్రబాబు చాలానే నిర్వహించారు. ప్రతీ సదస్సు తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చెప్పటం, ఫొటోలు దిగటం ఎల్లో మీడియాతో అంతా బ్రహ్మాండమని రాయించుకోవటంతోనే సరిపోయింది.

నిజానికి చంద్రబాబు హయాంలో పెట్టుబడులు ఎంత వచ్చాయని అడిగితే  చెప్పేవాళ్ళే లేరు. ఎందుకంటే సదస్సులు మొత్తం ఎల్లో మ్యాజిక్ లాగ అయిపోయింది. నాలుగేళ్ళల్లో సదస్సుల కోసం చంద్రబాబు దాదాపు రూ. 130 కోట్ల విలువైన ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. పెట్టుబడుల ఆకర్షణ  కోసం ఏ ప్రభుత్వమైనా  ఎంతో కొంత ఖర్చు  చేయక తప్పదు.

ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ఇక్కడ కోట్ల రూపాయలు తగలేస్తూనే మరోవైపు అదే పేరుతో సుమారు 15 దేశాలు తిరిగటమే ఆశ్చర్యం. సదస్సుల నుండి పెట్టుబడులు ఏమీ రాలేదు. విదేశాల నుండి ఏమీ తేలేదు. మొత్తం మీద ఓ రూ 250 కోట్ల ఖర్చు మాత్రం తేలింది. అందుకనే పెట్టుబడుల సదస్సు అంటేనే జనాలు చాలా లైట్ గా తీసుకుంటున్నారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే