పాదయత్రాకు కొద్ది రోజుల బ్రేక్ ? వైద్యుల మాట వింటారా ?

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కొద్ది రోజులు బ్రేక్ పడుతుందా ?  చికిత్సను అందించిన డాక్టర్లు చెబుతున్న మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చి హఠాత్తుగా జగన్ పై కత్తితో యువకుడు దాడి చేశాడు. చివరి నిముషంలో ప్రమాదాన్ని గ్రహించి జగన్ పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది.

సరే, వెంటనే విమానాశ్రయంలోనే ఉన్న డ్యూటీ డాక్టర్ తో ప్రధమ చికిత్స చేయించారు. వెంటనే విశాఖ నుండి జగన్ హైదరాబాద్ వచ్చేసి సిటీ న్యూరో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. జగన్ కు వైద్యం చేసిన డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ, జగన్ కు కొద్ది రోజుల విశ్రాంతి అవసరమన్నారు. కత్తిపోటు సుమారు 4 సెంటీమీటర్ల లోతులో దిగిందన్నారు. అదే సమయంలో భుజం దగ్గరున్న కండరంలో కూడా కత్తి దిగిందని చెప్పారు. అందుకే తొమ్మిది కుట్లు వేసినట్లు చెప్పారు. లోతుగా అయిన గాయం మానేందుకు కొద్ది రోజులు పడుతుందని స్పష్టంగా చెప్పారు.

వైద్యుల సూచనలు చూస్తుంటే జగన్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని నేతలంటున్నారు. వైద్యుల సూచనలు కాదని  జగన్ గనుక వెంటనే పాదయాత్రకు పూనుకుంటే గాయంకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు. పాదయాత్రలో జగన్ రోజుకు కొన్ని వందల మందికి సన్నిహితంగా వస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. ఆ సమయంలో ఎవరైనా మళ్ళీ ఎడమభుజంవైపు వచ్చి తగిలితే గాయం తిరిగి పెద్దదయ్యే అవకాశం ఉంది. లేకపోతే దుమ్ము, దూళి కారణంగా కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు సూచించారు. వైద్యులు ఏమి చెప్పినా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం జగనే. మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే