చంద్రబాబు ఎంత రచ్చ చేసుండేవారో తెలుసా ?

జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుకు మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా అర్ధమవుతోంది. చంద్రబాబు హయాంలో అయితే ఈ కార్యక్రమాలకు ఎంత రచ్చ చేసుండేవారో ఎవరికి వారుగా అంచనా వేసుకోవాల్సిందే. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో జరిగిన, జరగబోతున్న రెండు అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం.

గురువారం అనంతరపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కియా కార్ల ప్లాంటులో ఉత్పత్తయిన మొదటికారు విడుదలైంది. ఇక శుక్రవారం విజయవాడలో పెట్టుబడుల ఆకర్షణకు డిప్లమాటిక్ ఔట్ రీచ్ పేరుతో భారీ సదస్సు మొదలవ్వబోతోంది.  35 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్న సదస్సును జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే కియా కార్ల విడుదల విషయంలో కానీ, డిప్లమాటిక్ ఔట్ రీచ్ విషయంలో కానీ జగన్ ఎక్కడా హడావుడి చేయలేదు. కియా కారు విడుదల్లో  అసలు జగన్ పాల్గొనలేదు కూడా.  మొదటి కారును విడుదల చేయాల్సింది జగనే. అయితే ఢిల్లీలోనే ఉండిపోవటంతో తనకు బదులుగా మంత్రులను కార్యక్రమంలో పాల్గొనమని ఆదేశించారు.

నిజానికి ఈ సమయంలో చంద్రబాబు అధికారంలో ఉండుంటే ఎంత రచ్చ చేసుండేవారో అందరికీ తెలుసు. కార్ల ఉత్పత్తి కాకుండానే దాదాపు ఏడాది క్రితం కొరియా నుండి కార్లను తెప్పించి ఇక్కడి ప్లాంటులోనే ఉత్పత్తయిందని అబద్ధాలు చెప్పి రిలీజ్ చేయించిన ఘనుడు చంద్రబాబు. ఆరోజు ప్రభుత్వం, పార్టీ తరపున ఎంత హంగామా చేశారో అందరూ చూసిందే.

ఇక రాని పెట్టుబడుల పేరుతో వరసుగా పెట్టుబడుల సదస్సంటూ నాలుగు ఏళ్ళు చేసిన గోల కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రచారం కన్నా పనిజరగటం ముఖ్యమనుకున్న జగన్ ప్రశాంతంగా పనులు చేసుకుపోతున్నారు. కాబట్టే ఎక్కడా హడావుడి కనబడటం లేదు. ఇక్కడే జగన్-చంద్రబాబు మధ్య తేడా ఏమిటో తెలిసిపోతోంది.