ప్రధాని నరేంద్ర మోడీని వైఎస్ జగన్ ఎందుకు ప్రశ్నించరు.?

Modi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రైల్వే జోన్ అంశాన్ని నాన్చుతోంది. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా ఏ విషయంలో అయినా, కేంద్రం రాష్ట్రం పట్ల బాధ్యతతో వ్యవహరించడంలేదు. రాజధాని విషయంలోనూ కేంద్రం ‘మాకేంటి సంబంధం.?’ అన్నట్లే వ్యవహరిస్తోంది.

మిగతా విషయాలు ఖర్చుతో కూడుకున్నవని అనుకుందాం. శాసన మండలి రద్దు వ్యవహారం కావొచ్చు, దిశ చట్టం విషయంలో కావొచ్చు.. కేంద్రం అడ్డుతగలడానికి బలమైన కారణాలు ఏముంటాయ్.? సరే, కేంద్రం పట్టించుకోవడంలేదు.. రాష్ట్రం ఏం చేస్తోంది.? రాష్ట్రంలోని అధికార పార్టీ ఏం చేస్తోంది.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీలు చిక్కినప్పుడల్లా కేంద్రంపై మండిపడుతుంటారు. లెక్కలు తీసి మరీ, కేంద్రంపై దుమ్మత్తిపోస్తుంటారు. జాతీయ స్థాయిలో మోడీ సర్కారుకి వ్యతిరేకంగా బలాన్ని కూడగడతామంటారు. మరి, ఈ ప్రక్రియలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు భాగమవడంలేదు.? పోనీ, సొంతంగా అయినా, మోడీ సర్కారుని ఎందుకు వైఎస్ జగన్ నిలదీయడంలేదు.?

మొన్నటికి మొన్న పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ, ‘కేంద్రం ఇవ్వాల్సినవి ఇవ్వడంలేదు..’ అన్నారే తప్ప, ఆ విషయాన్ని ఇంకాస్త గట్టిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రంపై మండిపడుతూ చెప్పాలి కదా.? వైఎస్ జగన్ మెతక వైఖరిపై ప్రతిసారీ బోల్డంత చర్చ జరుగుతుంటుంది. ‘ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు కేంద్రంపై ఉద్యమాలు చేశాం.. నిరాహార దీక్షలు చేశాం.. ఎంపీలైతే తమ పదవుల్ని సైతం వదులుకున్నారు.. ఇప్పుడేమైంది మనకి.?’ అంటూ వైసీపీ శ్రేణులే తమ అధినేత తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

కేంద్రాన్ని నిలదీసి కేసీయార్ సాధించినదేంటి.? నిలదీయకపోవడం వల్ల వైఎస్ జగన్ అదనంగా సాధించినదేంటి.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తుంటాయనుకోండి.. అది వేరే సంగతి.