జగన్నాటకం మాత్రమే ఎందుకు.? చంద్ర మాయ గురించి చెప్పరెందుకు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమరావతి పేరుతో భూ కుంభకోణం జరిగిన మాట వాస్తవం. వైఎస్ జగన్ సర్కారు, ఆ కుంభకోణాన్ని బయట పెట్టలేకపోతున్నమాట కూడా వాస్తవం. రాజకీయాలు అంటేనే అంత. రాజకీయ నాయకులు ఎక్కడినుంచో పుట్టుకురారు.. ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు మారతారంతే. ఈ క్రమంలో 60-40 ఒప్పందాలు ఆయా రాజకీయ పార్టీల మధ్య కామన్.

‘జగన్నాటకం’ పేరుతో టీడీపీ అనుకూల మీడియా తెరపైకి తెచ్చిన కథనం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి, ఇందులో కొత్తగా చెప్పిందేమీ లేదు. పాత వ్యవహారమే. అమరావతి విషయంలో వైఎస్ జగన్ ఎలా మాట మార్చిందీ ప్రపంచమంతా చూస్తూనే వుంది.

మద్య నిషేధం విషయంలో కావొచ్చు.. సీపీఎస్ రద్దు విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ‘మాట తప్పుడు, మడమ తిప్పుడు’ వైఖరే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ‘జగన్నాటకం’ అంటున్నారు బాగానే వుంది. మరి, ‘చంద్ర మాయ’ మాటేమిటి.?

స్వర్గీయ ఎన్టీయార్ మద్య నిషేధాన్ని అమలు చేస్తే, చంద్రబాబు దాన్ని ఎత్తిపారేశారు. చంద్రబాబు పుణ్యమే బెల్టు షాపులు. అవన్నీ పాత వ్యవహారాలని అనుకుందాం. అమరావతి గురించే మాట్లాడుకుందాం. చంద్రబాబు చేసిందేంటి అమరావతి పేరుతో.? అమరావతి ముసుగులో పచ్చ రాబందులు, భూముల్ని కబ్జా చేశాయ్.

కేవలం అమరావతి ప్రాంతంగా చెప్పబడుతున్న 29 గ్రామాల్లోనే కాదు, ఇటు కృష్ణా జిల్లా విజయవాడ పరిసరాల్లో పచ్చ గద్దలు పెద్దయెత్తున భూముల్ని కొల్లగొట్టాయ్. దురదృష్టమేంటంటే, ఆ భూముల గురించి వైసీపీ సర్కారు పెద్దగా పట్టించుకోకపోవడం.

టీడీపీ అనుకూల మీడియా అనండీ, పచ్చ మీడియా అనండీ, వైసీపీ అనుకూల మీడియా అనండీ, బులుగు మీడియా అనండీ.. పేరు ఏదైతేనేం, ‘నిజాల్ని చెప్పే ముసుగేసుకుని, సగం నిజం చెప్పడంతోనే’ అసలు సమస్య వస్తోంది. ఆ దాచే విషయంపై ఫోకస్ వెళ్ళి, అసలు సమస్య పట్ల ప్రజల్లో చర్చ జరగకుండా పోతోంది.