వైనాట్ 175.! అవన్నీ పెయిడ్ సర్వేలేనా.?

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు దాటింది.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ‘వై నాట్ 175’ అంటోంది వైసీపీ.! ఎట్టి పరిస్థితుల్లోనూ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 175 నియోజకవర్గాల్నీ గెలుచుకుంటామన్న ధీమా వైసీపీ వ్యక్తం చేస్తోంది.

అయితే, మొన్నామధ్యన జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. టీడీపీ పుంజుకుంది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ‘మా ఓటర్లు వేరే వున్నారు..’ అంటూ వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మారింది.

అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ‘ఎన్ని ఇబ్బందులున్నా, సకాలంలో బటన్ నొక్కి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాం.. చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పుకోలేకపోతేనే ఇబ్బంది..’ అంటూ పార్టీ ముఖ్య నేతల్ని, అందునా ప్రజా ప్రతినిథుల్ని హెచ్చరిస్తున్నారు.

గడప గడపకీ మన ప్రభుత్వం సహా అనేక కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఎంత గట్టిగా వైసీపీ ప్రయత్నించినా, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది వచ్చే ఎన్నికల్లో కీలక భూమిక పోషించనుంది. అయినాగానీ, చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నాయి.

తాజాగా, టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం, 25 లోక్ సభ సీట్లకుగాను, ఇరవై నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని తేలింది. దీనిపై అధికార వైసీపీలో సంబరాలు జరుగుతున్నాయి. అదే సమయంలో విపక్షాల్లో ఆక్షేపణ కనిపిస్తోంది.

‘పెయిడ్ సర్వే..’ అంటూ ఓ వైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన నినదిస్తున్నాయి. టైమ్స్ సంస్థకు 10 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ‘సమర్పించుకుంది’ అనీ, దాని ఫలితమే ఇదంతా అనీ.. టీడీపీ, జనసేన అంటున్నాయి. ఎంత సమర్పణలు జరిగినా.. మరీ, ఈ స్థాయిలో సర్వేల ఫలితాలు వస్తాయా.? ఈ విషయమై విపక్షాలూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.