పోలవరం ప్రస్తావనను ఢిల్లీలో కేటీయార్ ప్రస్తావించారెందుకు.?

ఒకే ఒక్క పాయింట్.! అత్యంత కీలకమైన పాయింట్ ఇది. పోలవరం ప్రాజెక్టుని కేంద్రం ఎందుకు పూర్తి చేయలేకపోయింది.? అన్న ప్రశ్నను తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లేవనెత్తారు.. అదీ దేశ రాజధాని ఢిల్లీలో.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో కేటీయార్ ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, అత్యంత చిత్తశుద్ధితో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిందనీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని మాత్రం పూర్తి చేయలేకపోయిందని కేటీయార్ నిలదీసింది.

ఈ అంశం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నానా రకాల ప్రయత్నాలూ చేసిందనే ఆరోపణలు వున్నాయి. ఇవి ఉత్త ఆరోపణలు కాదు, కొంత వాస్తవం కూడా లేకపోలేదు అందులో.

కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.. అదీ కేంద్రం సాయం చెయ్యకుండానే. పోలవరం పరిస్థితి అది కాదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. నిజానికి, ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఇది. కేంద్రం, రాష్ట్రం.. రెండూ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం కారణంగానే పోలవరం అటకెక్కింది. ఈ అంశాన్ని కేటీయార్ వ్యూహాత్మకంగా, పరోక్షంగా ప్రస్తావించినట్లయ్యింది.

ఇలా ఏపీ తరఫున తెలంగాణను ప్రశ్నించే రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం శోచనీయమే.