అకస్మాత్తుగా కమల్ హాసన్ రాజకీయ మౌనం… ఎమయిందబ్బా?

 
(సికిందర్)

 తమిళ స్టార్ కమల్ హాసన్ ‘విశ్వరూపం -2 ‘తో  ప్రేక్షకుల ముందుకు, అలాగే తన భావి ఓటర్ల ముందుకూ రావడానికి సిద్ధమయ్యారు. 2013 లో తీసిన ‘విశ్వరూపం’ వివాదాస్పదమైన దృష్ట్యా ఈసారి అలాటి దుమారాలు రేగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఎందుకంటే ఈసారి తను రాజకీయాల్లో వున్నారు. ఐదేళ్ళ క్రితం ‘విశ్వరూపం’ తీసినప్పుడు దాని టైటిల్ కూడా వివాదాస్పదమైంది. హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ సంస్కృతంలో వున్న సినిమా టైటిల్ ని, తమిళంలోకి మార్చాలంటూ ఆందోళనకు దిగింది.

 

ఇదలా వుండగా, సినిమాని డైరెక్ట్ టు హోమ్ రిలీజ్ చేస్తానని కమల్ ప్రకటించడంతో థియేటర్ల ఓనర్లు వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇంతలో సినిమా ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా వుందని ముస్లిం వర్గాలు ఆందోళనకి దిగాయి. దీంతో శాంతిభద్రతల సమస్యని దృష్టిలోపెట్టుకుని ముఖ్యమంత్రి జే జయలలిత ‘విశ్వరూపం’ ని నిషేధించారు. దీంతో కమల్ హాసన్ దేశం విడిచి వెళ్ళిపోతానని నిరసన వ్యక్తం చేశారు కూడా. చివరికి ముస్లిం వర్గాలతో చర్చలతో అయిదు సీన్లు మ్యూట్ చేయడానికి అంగీకరించి, సినిమాని విడుదల చేసుకున్నారు. 

          ఇన్నిజరిగినా కమల్  ‘విశ్వరూపం-2’  తీశారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో తేడా ఏమిటంటే, ఇప్పుడు జయలలిత జీవించి లేరు, కమల్ రాజకీయాల్లో వున్నారు. ‘విశ్వరూపం’ సీక్వెల్ అయిన ‘విశ్వరూపం -2’ ని ఈ నెల 10 వ తేదీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కమల్ లాగే రాజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి దిగారు. రజనీకాంత్ ఇటీవలే ‘కాలా’ అనే రాజకీయ నేపధ్యమున్న సినిమా తీసి ఒక సందేశమిచ్చుకున్నారు. రాజకీయాల్లోకి దిగడం ద్వారా స్టార్స్ ఇద్దరూ తమ నట జీవితాలకి కొత్త ఊపిరులూదినట్లయింది.

 

ఈసారి కమల్ సీక్వెల్ ని ఎటువంటి వివాదాస్పద అంశాల జోలికీ వెళ్ళకుండా, ఒక గూఢచార థ్రిల్లర్ గా నిర్మించినట్టు చెప్పారు. కథ ప్రధానంగా తన పాత్ర (మేజర్ విసమ్ అహ్మద్ కశ్మీరీ) నేపధ్యం చుట్టూ తిరుగుతుందనీ, అతను గూఢచార సంస్థ ‘రా’ ఏజెంట్ అలా అయ్యాడో చూపించి,  మరో సీక్వెల్ తీసేందుకు అనువుగా ముగించామనీ కమల్ వివరించారు. కాగా, ఇందులో ఆండ్రియా, పూజా కుమార్, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ లు ప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. జిబ్రాన్ సంగీతం నిర్వహించారు. 


          ఈ గూఢచార థ్రిల్లర్ గురించి మరిన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు కమల్. గూఢచార కథలంటే తన కెంతో ఇష్టమనీ, చిన్నప్పుడు తన మేనమామ ఎన్నో గూఢచార కథలు చెప్పేవారనీ, ఆయన ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేసేవారనీ, ఆ కథలే ఈ సీక్వెల్ తీయడానికి పురిగొల్పాయనీ చెప్పుకొచ్చారు. 

          కమల్ ఈ సీక్వెల్ ని తను రాజకీయ పార్టీని స్థాపించే ముందే ప్రారంభించారు.  ఇది కేవలం ఒక యాక్షన్ ఎంటర్ టైనరే తప్ప, ఎలాటి రాజకీయ పంచ్ డైలాగులూ వుండవని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కాగా, ఉత్తర అమెరికా సహా మన దేశంలో తమిళ, ,హిందీ భాషల్లో  దేశవ్యాప్తంగా (హిందీ వెర్షన్) విడుదలకు ప్రముఖ పంపిణీదార్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కమల్ స్వయంగా విడుదల చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రాజనీకాంత్ ‘రోబో -2’ కూడా తెలుగులో కొనుగోలు దార్లు లేరు. ప్రతిష్టాత్మక  సినిమాలకు కూడా తెలుగులో కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారంటే, ఈ ఇద్దరు స్టార్స్  సినిమాల పట్ల బయ్యర్స్ లో ఏర్పడ్డ భయం అలాంటిది. 

          తమిళ నాడులో సోలో రిలీజ్ గా విడుదలవుతోంది. నయనతార నటించిన ‘కొలమవ్వు కోకిల’ కూడా ఆగస్టు 10 న విడుదల కావాల్సి వుండగా దాన్ని 24 వ తేదీకి మార్చుకున్నారు. తెలుగులో నితిన్ తో దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ 9 వ తేదీ విడుదలవుతోంది. దీంతో బాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదలవుతాయి. కమల్ సీక్వెల్ కి ‘శ్రీనివాస కళ్యాణం’ తో పోటీ వుంటుంది. ఆ తర్వాత 15 వతేదీ విడుదలయ్యే విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ తో తలపడాల్సి వుంటుంది. ఇక అటు హిందీలో ఆగస్టు 15 న అక్షయ్కుమార్ నటించిన  ‘గోల్డ్’ విడుదలవుతోంది. 

          ఇకపోతే, ఇటీవల కమల్ హాసన్ రాజకీయాల్లో ఆకస్మిక మౌనం వహిస్తున్నారు. సున్నిత అంశాలపైన ఎలాటి కామెంట్లు కూడా చేయడంలేదు. అనవసరంగా ప్రభుత్వంతో ఇప్పుడు పెట్టుకోవడ మెందుకని కావొచ్చు.

          2015 లో కమల్ తీసిన ‘తూంగ వనం’ (చీకటి రాజ్యం) ఫ్లాపయిన నేపధ్యంలో ‘విశ్వరూపం -2’  విడుదలవుతోంది. ఇదే సమయంలో ఆయన నటిస్తున్న ‘భారతీయుడు – 2’ షూటింగు శంకర్ దర్శకత్వంలో ప్రారంభమవుతోంది. సినిమాలతో బిజీగా వున్న కమల్, రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దిగేవరకూ ఇటు రాజకీయాల్లో, అటు సినిమాలలో పని చేస్తూనే వుంటానని చెప్పారు. ఐతే ‘విశ్వరూపం -2’ జయాపజయాలే ఆయన రాజకీయ రంగ / సినిమారంగ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఆదర్శమని ఆ మధ్య  ప్రకటించి కమల్ ఒక సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే.