ఏపీలో బీఆరెస్స్ టార్గెట్ ఎవరంటే…!

ఇప్పటికే తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగి వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆరెస్స్ (టీఆరెస్స్).. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా జెండా పాతాలని తెగ ఉవ్విళ్లూరుతుంది! అయితే.. ఇంతకూ ఏపీలో బీఆరెస్స్ అధికారంలోకి రావడం సంగతి కాసేపు పక్కనపెడితే.. అసలు ఏపీ బీఆరెస్స్ లక్ష్యం ఏమిటన్న సందేహాలకు తాజాగా క్లారిటీ దొరికింది!

ఏపీలో కూడా కాస్త బలంగానే రంగంలోకి దిగాలని.. ఇప్పటికే న్యూస్ పేపర్ కూడా స్టార్ట్ చేస్తున్న బీఆరెస్స్ లక్ష్యం గురించి ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ చెప్పుకొచ్చారు. ఏపీలో బీజేపీని ఓడించాలని – మోడీని చూసి ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెబుతున్నారు. అంటే… బీఆరెస్స్ ప్రధాన ప్రత్యర్థి ఏపీ బీజేపీ అనుకోవాలన్నట్లు!

తెలంగాణలో బీఆరెస్స్ కు బీజేపీ సరైన ప్రత్యర్థిలాగానే ప్రయత్నాలు చేస్తుంది. బండి సంజయ్ నేతృత్వంలో టి.బీజేపీ.. కేసీఆర్ కు కాస్త చెమటలు పట్టించే పనులు కూడా చేసింది. అది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. అక్కడ బీఆరెస్స్ కు బీజేపీ ప్రత్యర్ధి అంటే ఒప్పుకోవచ్చు కానీ… ఏపీలో అంటే ఎలా?

ఎందుకంటే… ఏపీలో బీజేపీ ఓట్ల శాతం, కాస్త అటు ఇటుగా నోటాకు సమానం! ఏపీలో బీజేపీ ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి ఫెర్మార్మెన్స్ ఇచ్చిందే లేదు! అలాంటి బీజేపీతో ఏపీలో బీఆరెస్స్ పోటీపడుతుందని చెప్పడం చంద్రశేఖర్ ఉద్దేశ్యం అయితే… అంతకు మించిన దౌర్భాగ్యం లేదేమో!!