వైసీపీ నేతలు బీసీలను ఉద్దరిస్తున్నట్లు డప్పు కొట్టుకుంటూ.. బీసీలకు ఖాళీ చెంచాతో అన్నం తినిపించినట్లు వ్యహరిస్తున్నారు. 18 నెలల నుంచి బీసీలకు రేషన్ బియ్యం, ఫించన్లు ఇవ్వడం తప్ప ప్రభుత్వం వారికి చేసిందేంటి? ఒక్క బీసీ విద్యార్థినైనా విదేశీ విద్యకు పంపారా? ఒక్క బీసీ యువకుడికైనా కనీసం ఒక లక్ష రూపాయల రుణం ఇచ్చారా? ఒక్క బీసీ యువతికైనా పెళ్లి కానుక అందించారా? ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అంధించే సంక్షేమ పథకాలను బీసీలకు ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా చేసిందేంటి? వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన మేలు కంటే వారికి జరిగిన ద్రోహమే ఎక్కువ. టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఏటా రూ.1000 కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లు అందించి వారి అభివృద్ధికి కృషి చేసింది.వైసీపీ ప్రభుత్వ 18 నెలల పాలనలో బీసీలకు చేసింది శూన్యం.
కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికి మేలు చేస్తున్నామని చెప్పడానికి వైసీపీకి ఏమాత్రం సిగ్గనిపించటం లేదు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరిట కేవలం 4.37 లక్షల మందికి రూ.10 వేలు మంజూరు చేసి బీసీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. నిధులు, విధులు లేని కార్పొరేషన్ ల వల్ల బీసీలకు ఒనగూరేది ఏంటి? ఏ కార్పొరేషన్ అయినా నిధులు లేకుండా, కార్యకలాపాలు లేకుండా లాభాలు ఎలా ఆర్జిస్తుందో చెప్పాలి? టీడీపీ ప్రభుత్వం 1187 బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.165 కోట్లు, 12 బీసీ భవనాల కోసం రూ.56.47 కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ నిలిపివేశారు. టీడీపీ హయాంలో 16యూనివర్శిటీల్లో 9 యూనివర్శిటీలకు వీసీలుగా, టీటీడీ, ఏపీఐఐసీ, తుడా ఛైర్మన్ వంటి కీలక పోస్టుల్లో బీసీలను నియమిస్తే.. జగన్మోహన్ రెడ్డి ఆయా పోస్టులన్నింటినీ తన సొంత సామాజిక వర్గనికి కట్టబెట్టలేదా?
నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జీవోలిచ్చిన జగన్మోహన్ రెడ్డి 37 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో ఎంత మందికి స్థానం కల్పించారు. 750 మంది నామినేటెడ్ పదవుల్లో బీసీలెంతమంది ఉన్నారు? నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న జగన్మోహన్ రెడ్డి పోలవరం, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులను బీసీలకు ఎందుకు కేటాయించలేదు? తన కేసుల నుంచి బయటపడటానికి అరడజను మంది న్యాయవాదులను పెట్టుకొన్న జగన్ రెడ్డి 30 యేండ్లుగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజిర్వేషన్లు పోతే కనీసం ఒక్క న్యాయవాధినైనా నియమించారా? కార్పొరేషన్ల పేరు చెప్పి తామేదో బిసిలని ఉద్దరించామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు, ఎంతమంది బిసిలకు ప్రత్యేకంగా న్యాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీలకు మేలు చేస్తున్నామన్న తప్పుడు ప్రచారం ఆపి నిజంగా మేలు చేసే కార్యక్రమాలని మొదలు పెడితే బిసిలు అందరూ జగన్ కి జైకొడతారు .