వారాంతం వస్తుందంటే చాలు తెలుగుదేశం నేతలు వణికిపోతున్నారు. రెవెన్యూ అధికారులొచ్చి ఎప్పుడు ఎవరి భూములను, ఆస్తులను సోదాలు చేస్తారో, కూలగొడతారోనని బిక్కిబిక్కుమంటున్నారు. స్వయంగా టీడీపీ నేతలే వీకెండ్ వస్తుందంటే భయపడాల్సి వస్తోంది అన్నారు. మిషల్ బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పనిని జగన్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అందులో భాగంగానే విశాఖలో టీడీపీకి ముఖ్య నేతలుగా ఉన్నవారిపై నిఘా పెట్టింది. ఇప్పటికే సబ్బం హరికి చెందిన ఇంటి పరిసరాల్లో పార్కు భూముని స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ నిర్వహిస్తున్న గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్నాయని చెబుతున్న కోట్ల విలువైన భూములను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అలాగే టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న ఒక వ్యక్తికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ మీద కూడ ఇదే ఎఫెక్ట్ చూపించారు.
అలాగే గంటా శ్రీనివాసరావు ఆధీనంలో ఉన్న కొంత భూమి కూడ అక్రమంగా ఆక్రమించుకున్నదే అంటూ గోడలు కొల్లగొట్టి సర్కారువారి బోర్డు పాతారు. తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు గురిపెట్టారు. టీడీపీ హయాంలో వెలగపూడి ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. విశాఖలోనే ఖరీదైన ప్రాంతంగా పేరున్న రిషి కొండలో వెలగపూడి పేరు మీదున్న భూములను సర్వే చేసిన రెవెన్యూ అధికారులు తన భూమితో పాటు ఆరు సెంట్ల గెడ్డ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న షెడ్ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ తతంగం మొత్తం తెల్లవారుఘామున జరిగింది. దీంతో వెలగపూడికి గట్టి షాక్ తగిలినట్టైంది.
చాలారోజులుగా వెలగపూడి వైసీపీలోకి వెళతారనే ప్రచారం ఉంది, కానీ ఆయన వెళ్ళలేదు. ప్రభుత్వం మీద మరింత గట్టిగా వాయిస్ వినిపించారు. అసెంబ్లీలో అమరావతి నినాదాన్ని గట్టిగా వినిపించారు. ఇటీవల న్యాయవ్యవస్థలు విషయంలోనూ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం అఫిడివిట్ దాఖలు చేయడంపై వెలగపూడి మండిపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే విశాఖలో టీడీపీ తరపున వైసీపీ మీద గట్టిగా ఫైట్ చేస్తున్నది రామకృష్ణబాబు ఒక్కరే. ఆయన మీదే ఈరోజు కబ్జా ఆరోపణలు, రెవెన్యూ అధికారుల చర్యలు సంచలనం రేపాయి.
మరోవైపు ఆనందపురం మండలం భీమన్న దొరపాలెంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి సర్వే నెంబర్ 150లో సుమారు 60 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆధీనంలో ఉన్నాయని చెబుతున్నారు. వీటి విలువ 300 కోట్ల పైమాటేనట. కానీ పీలా గోవింద్ మాత్రం ఆ 300 ఎకరాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.