జనసేనను అనుమానిస్తున్న తమ్ముళ్లు… అందులో న్యాయముంది!

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన కలిపి ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే! అధికారికంగా ఈ పొత్తు ప్రకటన పూర్తిగా రానప్పటికీ, రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఈ విషయంపై ఎప్పుడో స్పష్టత వచ్చేసింది. పరోక్షంగా పవన్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు! అయితే తాజాగా జనసేన అధినేత పవన్ చేసిన ఒక వ్యాఖ్య… ఇప్పుడు టీడీపీలో కొత్త అలజడిని సృష్టించిందని తెలుస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను.. జగన్ ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యం.. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తాను సీఎం సీటు అడగడాం భావ్యం కాదు.. ఇన్ని రోజులూ పవన్ చెప్పిన మాటలు ఇవి. అయితే ఈ విషయాలపై కేడర్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే కామెంట్లూ బలంగా వినిపించాయి. ఇంతకాలం కష్టపడి పార్టీకి పనిచేసింది.. తమ కష్టం మొత్తాన్ని బాబు పాదాల దగ్గర పరుస్తారని కాదంటూ ఆన్ లైన్ వేదికగా జనసైనికులు కామెంట్లు చేశారు. దీంతో… దిద్దుబాటు చర్యల్లో భాగంగా అన్నారో.. లేక, నిజంగానే తన మనసులో ఆ మాటుందో తెలియదు కానీ… ఒక వైరల్ వ్యాఖ్య చేశారు పవన్.

“ఎవరినో సీఎం చేడానికి కాదు మనం ఉన్నది” అని పవన్ తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో కొత్త విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఫలితంగా పవన్ ను సంకించడం మొదలుపెట్టారంట టీడీపీ సీనియర్లు. జనసేనతో పొత్తు కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఉంటుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. పవన్ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారంట.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి పోటాపోటీ సీట్లు వస్తే.. పవన్ ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్యం లేదని అంటున్నారట టీడీపీ సీనియర్లు. అప్పుడు తనకే సీఎం సీటు అని అన్న ఆశ్చరం లేదని చెబుతున్నారంట. పవన్ మనసులో అదే ఆలోచన ఉండి ఉంటుందని… అందుకే నిన్నమొన్నటి వరకూ జగన్ ని గద్దె దింపడమే తన లక్ష్యం అని చెప్పిన పవన్… ఎవరినో సీఎం చేయడానికి తాను పార్టీ పెట్టలేదని చెప్పిన మాటల ఉద్దేశ్యం అదేఅని నమ్ముతున్నారంట. ఆ కీలక సమయంలో పవన్ తో కలిసి బీజేపీ చక్రం తిప్పి పార్టీని దెబ్బతీసే అవకాశాలూ లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

మరి పురిట్లోనే ఇన్ని అనుమానాలతో ప్రయాణం మొదలైతే… ఎలాంటి ఫలితాలొస్తాయనేది వేచి చూడాలి