టీడీపీ – జనసేన @ విజయవాడ.. కొత్త టెన్షన్ స్టార్ట్!

ప్రస్తుతం అధికారికంగా కనిపిస్తోన్న రాజకీయాల ప్రకారం చూస్తే… రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతుంటే… అనధికారికంగా ఎన్నికల సమయానికి టీడీపీ – జనసేన కలవడం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు. అయితే మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోయినా… ఈ రెండు పార్టీలూ కన్ ఫాం అని అంటున్నారు.

ఇందులో భాగంగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే విజయవాడలో టీడీపీ నాయకులకు త్యాగాలు తప్పకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో విజయవాడ ఎంపీ సీటు నుంచి మొదలు.. ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా సమస్య తప్పకపోవచ్చని అంటున్నారు.

అవును… ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ రాజధాని విజయవాడలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ కూటమిలో బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా… విజయవాడ పార్లమెంట్ తో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

విజయవాడ నగర పరిధిలోని మూడు అసెంబ్లీ సీట్లలో ఈ సారి పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా… తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యలమంచిలి రవి తిరిగి జనసేన నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరిలో ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే… 2009 ఎన్నికల్లో యలమంచిలి రవి నాటి కాంగ్రెస్ అభ్యర్ధి దేవినేని రాజశేఖర్ ను స్వల్ప మెజార్టీతో ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2019 లో వరుసగా టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ గెలుపొందారు. మరోపక్క ఈ సారి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాశ్ పోటీ ఖాయమైంది. దీంతో రాబోయే ఎన్నికల్లో అవినాశ్ వర్సెస్ యలమంచిలి రవి పోటీ కన్ ఫాం అని అంటున్నారు.

ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ పైనా రెండు పార్టీల నేతల్లో చర్చ సాగుతోంది. విజయవాడ పశ్చిమం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పోతిన మహేశ్ జనసేన నుంచి సీటు ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే జరిగితే పోరు కాస్త రసవత్తరంగా ఉండే ఛాన్స్ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక కీలకమైన విజయవాడ పార్లమెంటు సీటు టీడీపీలోనే రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సీటు విషయంలో కేశినేని నానికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడం దాదాపు కన్ ఫాం అని అంటున్నారు.. ఇందులో భాగంగా.. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా కేశినేని చిన్ని ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో రెండు పార్టీలకు ఆమోద యోగ్యంగా సీట్ల ఖరారు జరగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దుల ఖరారు పైన విజయవాడ లోక్ సభ పరిధిలో ఆసక్తి పెరుగుతోంది. మరోపక్క ఈసారి బెజవాడ ఎంపీ సీటుపై జనసేన ఆసక్తి చూపిస్తోందని అంటున్నారు. మరి ఈ బెజవాడలో పొత్తులు ఎలాంటి మార్పులు తీసుకు రాబోతున్నాయనేది వేచి చూడాలి.

మరోపక్క సామాజిక సమీకరణల్లో భాగంగా… టీడీపీ తనకు బలమైన స్థానాలను జనసేనకు ఇవ్వడానికి అంగీకరిస్తాయా అనేది కూడా ఆసక్తిగా మారింది.