చంద్రబాబుతో విజయసాయిరెడ్డికి బంధుత్వం.!

చంద్రబాబుతో విజయసాయిరెడ్డికి బంధుత్వం వుందట.! చంద్రబాబేమో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. విజయసాయి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. పైగా, ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం. మరి, చంద్రబాబు ఎలా విజయసాయిరెడ్డికి సోదరుడు అవుతారు..

విజయసాయిరెడ్డి స్వయంగా చంద్రబాబుని తన అన్నయ్యగా పేర్కొన్నారు. దాంతో, వైసీపీ వర్గాలు కూడా షాక్‌కి గురయ్యాయి. విజయసాయిరెడ్డి చెప్పిన పూర్తి విషయం ఏంటన్నది పక్కన పెడితే, చంద్రబాబు నిజంగానే విజయసాయిరెడ్డికి బంధువు అని తేలిపోయింది.

తారకరత్న భార్యతో విజయసాయిరెడ్డికి బంధుత్వం వుందట. అలా చంద్రబాబు తనకు అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇది కదా అసలు సిసలు రాజకీయం అంటే.

బంధుత్వాలు కలుపుకునేందుకు రాజకీయాలు అడ్డంకి కావు. కానీ, పొద్దున్న లేస్తే.. రాజకీయంగా అత్యంత జుగుప్సాకరమైన విమర్శలు చేసుకుంటారు. ఇదే మరి, జనాల్ని వెర్రోళ్ళను చేయడమంటే.

అంతే కాదు, మద్యం కంపెనీల్లో తన అల్లుడికి వాటాలున్నాయంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని విజయసాయిరెడ్డి ఖండించారు. అదే సమయంలో, ఆయా వ్యక్తులు వేర్వేరు కంపెనీల్లో భాగస్వాములుగా వుండడం వింతేమీ కాదన్నారు. చంద్రబాబు ఆరోపణలు చేస్తోన్న కంపెనీల్లో చంద్రబాబు కోడలు బ్రాహ్మణికి కూడా వాటాలున్నాయన్నారు విజయసాయిరెడ్డి.

అంతేనా, తన బంధువులుగా చంద్రబాబు పేర్కొంటున్న వ్యక్తులు హెరిటేజ్ సంస్థలో కూడా వున్నారని, ఆ లెక్కన హెరిటేజ్‌తో తనకూ సంబంధాలు వున్నట్లేనని విజయసాయి వ్యాఖ్యానించడం గమనార్హం.