వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి కొత్త మీడియా హౌస్ ప్రారంభిస్తారట. న్యూస్ ఛానల్ అలాగే పత్రిక ఆ మీడియా హౌస్ నుంచి వస్తాయా.? ఏమో, ప్రస్తుతానికైతే ఆయన ఈ విషయమై పూర్తి స్పష్టత లేదు. ‘రాము’కి వ్యతిరేకంగా మీడియా సంస్థని స్థాపించాలన్నది విజయసాయిరెడ్డి ఆలోచన. ఆ ‘రాము’ ఎవరో కాదు, రామోజీరావు.
‘నీ మీడియా ఎలా వుంటుందో.. నా మీడియా ఎలా వుంటుందో చూపిస్తాను..’ అంటూ రామోజీరావుకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి న్యూస్ ఛానల్, పత్రిక నడపగలరా.? వైసీపీలో సోషల్ మీడియా విభాగం బాధ్యతల్ని గతంలో ఘనంగా నిర్వహించిన విజయసాయిరెడ్డికి, మీడియాని నడపడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
కాకపోతే, విజయసాయిరెడ్డి దగ్గర మీడియా హౌస్ ప్రారంభించేంత డబ్బులున్నాయా.? వుంటే, అవి ఎలా వచ్చాయ్.? అన్నదిప్పుడు చర్చనీయాంశం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా సంస్థ వుంది. అదే సాక్షి. గతంలో.. అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సాక్షి మీడియాని ప్రారంభించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
రాజకీయ పార్టీలకు కొన్ని మీడియా సంస్థలు వుండడం మామూలే. రాజకీయ పార్టీలే నడుపుతున్న మీడియా సంస్థలు అరుదుగా వుంటాయ్. వాటిల్లో సాక్షి ఒకటి. సాక్షి కంటే గొప్పగా విజయసాయిరెడ్డికి చెందిన మీడియా సంస్థ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించగలదా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు.
సరదాగానే అన్నారో, సీరియస్‌గానే అన్నారోగానీ, కొత్త మీడియా హౌస్ ప్రారంభిస్తానని విజయసాయిరెడ్డి అనడంతోనే, సాక్షి మీడియాపై ఆయనకు నమ్మకం పోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలంటూ రకరకాల అభిప్రాయాలు పోటెత్తుతున్నాయ్