వంశీకృష్ణ విషయంలో తగ్గేదేలే… పవన్ నుంచి కోరుకుంటున్నదిదే!

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా మెతక వైఖరి ప్రదర్శిస్తుంటారని.. బాబు చెప్పిన ప్రతీదానికి తలాడిస్తారని.. ఈ సమయంలో జనసేన నాయకులు, కేడర్ గురించి ఏమాత్రం ఆలోచన కూడా చేయరని.. బాబు చెప్పిన దానికి తాను తలాడించినట్లు, తాను చెప్పిన దానికి జనసేన శ్రేణులు తలాడించాలన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని కామెంట్లు వినిపించేవి!

అయితే… ఇప్పుడు మారిన పవన్ అని, పొత్తు అవసరం ఇరుపార్టీలకూ ఉంది కాబట్టి తాను అడిగిన కొన్ని ప్రత్యేక సీట్లను తనకు కచ్చితంగా ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నారని సమాచారం. అందుకు తాజాగా జనసేనలో జరిగిన చేరికే అని అంటున్నారు. ఆ చేరిక జనసేనకు ఇలాంటి సమయంలో అవసరం, సరికొత్త ఉత్సాహం కూడా కావడంతో పవన్ కల్యాణ్ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారని తెలుస్తుంది. అందుకు కారణం అయ్యింది… తాజాగా అధికార వైసీపీ నుంచి జనసేనలో చేరిన వంశీకృష్ణ విషయమే!

వివరాళ్లోకి వెళ్తే… అధికార వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఇది కచ్చితంగా జనసేనకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం ఒక్కొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో… ఇది జనసేనకు బూస్ట్ ఇచ్చే అంశమే. ఇలా జనసేన కండువా కప్పుకున్న అనంతరం స్పందించిన వంశీకృష్ణ… తాను పోటీచేయాలని అనుకున్న చోట జగన్ గతంలో అవకాశం కల్పించలేకపోయారని, ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో అవకాశం లేదని అన్నారు.

తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను గనుక.. పార్టీని వీడి జనసేనలో చేరానని తెలిపారు. ఇదే సమయంలో తాను పోటీచేయాలని అనుకున్న చోటునుంచి టికెట్ ఇవ్వడానికి పవన్ అంగీకారం తెలిపారని, ఆ మేరకు హామీ ఇచ్చారని కూడా ఆయన అంటున్నారు. అయితే ఇక్కడే పవన్ పట్టుదలకు జనసైనికులు హ్యాట్సాప్ చెబుతున్నారని.. ఇలా గట్టిగానే ఉండాలి తప్ప.. చంద్రబాబు దగ్గర జావకారిపోకూడదని చెబుతున్నారు. అందుకు కారణం… విశాఖ తూర్పు సీటు!

గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి అనుచరుడుగా పేరున్న వంశీకృష్ణ యాదవ్ కు విశాఖ తూర్పు నుంచి పోటీచేయాలని కోరిక. గత ఎన్నికల్లో ఆ సీటు ఆశించినా జగన్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ సీటు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కేటాయించబోతున్నారని సమాచారం. దీంతో… వంశీకృష్ణకు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. ఈ పదవి యాదవ్ కు ఇంకా నాలుగేళ్లవరకూ ఉంది. అయితే… తనకు మాత్రం విశాఖ తూర్పు ఎమ్మెల్యే అవ్వాలనే పట్టుదల బలంగా ఉండటంతో… పవన్ నుంచి ఆ మేరకు రావడంతో.. జనసేన కండువా కప్పుకున్నారు వంశీకృష్ణ!

అంటే… పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ పోటీచేయబోతున్నారన్నమాట! ఇది స్థానిక జనసేన కేడర్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనే చెప్పాలి. ఇక్కడ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు స్థానికంగా మంచి పేరు ఉండటంతో వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు.

అటువంటి స్థానాన్ని పవన్ కల్యాణ్ బలంగా నిలబడి, చంద్రబాబుని ఒప్పించి వంశీకృష్ణ యాదవ్ కోసం సాధించారంటే అది చిన్నవిషయం కాదని అంటున్నారు పరిశీలకులు. దీంతో… ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ లో మార్పు వచ్చిందని.. అయిన దానికీ కాని దానికి తలాడించే పవన్ కాదని.. తాను నమ్ముకున్న, తనను నమ్ముకున్న శ్రేణుల కోసం కాస్త గట్టిగానే నిలబడేలా మారినట్లున్నారని అంటున్నారు.