ఏపీలో వైసీపీ ప్రభంజనమే… తేల్చిన టైమ్స్ నౌ సర్వే!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో అధికార విపక్షాల సందడి సంగతి కాసేపు పక్కనపెడితే… సర్వేల ఫలితాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన పలు సర్వేలు ఏపీలో జగన్ విక్టరీ ఖాయంగా చెబుతున్న తరుణంలో… తాజాగా మరోసర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

అవును… ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమన్న విషయాన్ని ప్రముఖ ఇంగ్లిష్ మీడియా చానల్ టైమ్స్ నౌ తాజాగా జరిపిన సర్వేలో వెల్లడించింది. పైగా ఆ ఫలితాలు క్లీన్ స్వీప్ దిశగా ఉండటం గమనార్హం. ఈ ఫలితాలపై విపక్షాలు ఎలా స్పందిస్తాయనే సంగతి కాసేపు పక్కనపెడితే… అధికారపార్టీకి మాత్రం ఇది బూస్ట్ అనే చెప్పాలి!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని లోక్ సభా స్థానాల్ని సొంతం చేసుకునే అవకాశం ఉందన్న విషయంపై ఆ సంస్థ జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో ఏపీలో అధికార వైసీపీ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన విషయాన్ని వెల్లడించింది. తాజా సర్వేలో… ఏపీలో వైసీపీకి 24-25 ఎంపీ స్థానాల్లో ఏకపక్షంగా విజయం ఖాయమని వెల్లడైంది.

ఈ సర్వే పై స్పందించిన సంస్థ… జూన్ 15 – ఆగస్టు 12 మధ్యలో తాము చేసిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడినట్లుగా పేర్కొంది. ఇదే సంస్థ ఏప్రిల్ లోనూ సర్వే నిర్వహించింది. అప్పుడు కూడా ఏపీలో అధికారపక్షానిదే అధిక్యమని పేర్కొంది. అయితే.. అప్పటిసర్వేకి, తాజా సర్వేకీ స్వల్ప తేడా మాత్రమే ఉందని పేర్కొంది.

సదరు చానల్ వెల్లడించిన ఫలితాలను చూస్తే.. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా.. వైసీపీకి 24-25 స్థానాలు, విపక్ష టీడీపీకి 0-1 స్థానం లభించే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇదే సమయంలో జనసేన, బీజేపీకి ఏ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఫలితాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి!

కాగా… 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 49.8 శాతం ఓట్లతో 22 లోక్ సభా స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మిగిలిన 3 స్థానాలూ టీడీపీకి దక్కాయి. అయితే ఈసారి 51.3 శాతం ఓట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది సర్వే.

గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడా పార్టీకి 1.5 శాతం ఓట్లు పెరగనున్న విషయాన్ని వెల్లడించింది. దీంతో ఈ సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే… విపక్షాలు అవిరామంగా చేస్తోన్న విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారనే విషయం స్పష్టమవుతుంది.