చంద్రబాబు ముందున్న ఆప్షన్ అదొక్కటేనా.?

2024 ఎన్నికల్లో ఫలితాలు ఎలా వుండబోతున్నాయన్నదానిపై పలు సర్వేలు తాజాగా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ సర్వేలు ఎందుకు వచ్చాయి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కాకపోతే, వైసీపీ మెజార్టీ తగ్గుతుందనీ, అది కూడా వైసీపీ వల్లే జరుగుతందన్నది ఆయా సర్వేల సారాంశం.

ఈ సర్వేల విషయంలో టీడీపీ ఒకింత గుర్రుగానే వుంది. చిత్రమేంటంటే, టీడీపీ అనుకూల మీడియా సర్వేలు కూడా, టీడీపీకి అనుకూలంగా లేవు. అలా ఎందుకు ఆ సర్వేలు వచ్చాయి.? అంటే, జనసేన పార్టీకి వేరే ఆప్షన్ లేకుండా చేయడం. ఔను, టీడీపీతో జనసేన కలిసి వెళ్ళడం తప్ప జనసేనకు ఇంకో ఆప్షన్ లేదు.. అనే విషయాన్ని కుండబద్దలు గొట్టేందుకే ఈ సర్వేలు బయటకు వచ్చాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

అయితే, టీడీపీకి టీడీపీ అనుకూల మీడియానే ఎప్పుడూ శాపంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి కూడా టీడీపీ అనుకూల మీడియానే కారణం. ఇప్పుడూ ఆ టీడీపీ అనుకూల మీడియానే, టీడీపీ విజయావకాశాల్ని దెబ్బతీసేలా వుంది.

జనసేనకు ఓటు బ్యాంకు పెరిగిందని టీడీపీ అనుకూల మీడియా చెప్పడమంటే, దానర్థం.. జనసేన ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తుందని. సో, జనసేనకు టీడీపీ అధిక ప్రాధాన్యతనిచ్చి తీరాలి. అయితే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడు ఎలాగైనా మారిపోవచ్చు.

మూడు ముక్కలాటలో హంగ్ పరిస్థితులు వస్తే, జనసేనకి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ ఆశిస్తారు. చంద్రబాబు దానికి అంగీకరించక తప్పని పరిస్థితి. రెండేళ్ళు, మూడేళ్ళు.. ఇలా పంపకాలూ వుండొచ్చు. ఇదొక్కటే చంద్రబాబు ముందు ప్రస్తుతానికి వున్న ఆప్షన్. అలా చంద్రబాబుని టీడీపీ అనుకూల మీడియానే ఇరకాటంలో పడేసింది.