గుంటూరు పశ్చిమం… “తెలుగురాజ్యం” పరిష్కారం!

పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు ఇచ్చి పక్కనపెట్టిన బాబు… కీలక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో తల పట్టుకుంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులు, కార్యకర్తల అభిప్రాయాలు… వీటిలో వేటిని పరిగణలోకి తీసుకోబోతున్నారో తెలియదు కానీ… గుంటూరు పశ్చిమ సీటు ఇప్పుడు బాబుకు పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో “తెలుగు రాజ్యం” చంద్రబాబుకి ఒక పరిష్కారం చూపుతోంది!

2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గుంటూరు పశ్చిమం నుంచి గెలుపొందింది. ఈ నేపథ్యంలో 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. అయితే బీసీలు, కాపులూ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి వైసీపీ తరుపున బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో… బీసీ ప్లస్ కాపు ఫార్ములాతో జగన్ ముందుకు కదిలారు.

దీంతో టీడీపీ ఇరకాటంలో పడింది. ఆ సంగతి అలా ఉంటే… టీడీపీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ కు గట్టిపోటీనే కనిపిస్తుంది. ఇందులో భాగంగా… టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ తో పాటు తాళ్ల వెంకటేశ్‌, గల్లా మాధవి గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఆశిస్తున్నారు. వీరిలో డేగల ప్రభాకర్‌ కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాగా.. తాళ్ల వెంకటేశ్‌ బీసీ నేత. ఇక బీసీ వర్గానికే చెందిన గల్లా మాధవి బీసీ ప్లస్‌ కమ్మ కోణంలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

దీంతో టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు తల పట్టుకున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో చంద్రబాబుకు “తెలుగు రాజ్యం” ఒక పరిష్కారం చూపిస్తుంది. వాస్తవానికి బీసీలు, కాపులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన  పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో వైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దల గిరి టీడీపీ నుంచి పోటీ చేశారు.

ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ టిక్కెట్ “టీడీపీలో ఉన్న కాపు నేతకు.. లేకపోతే, జనసేనలో ఉన్న బీసీ నేతకూ” కేటాయిస్తే మంచి జరిగే అవకాశాలున్నాయని “తెలుగు రాజ్యం” విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు సుమారు 45 వేల వరకూ ఉన్నాయి. ఈ సమయంలో ఈ టిక్కెట్ ఆ వర్గానికి టికెట్‌ కేటాయిస్తే టీడీపీ – జనసేన కూటమికి కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

పైగా ఇప్పటికే గుంటూరులో కాపు ఓట్ల విషయంలో అధికార పార్టీ పగడ్భందీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా… గుంటూరు ఎంపీ టికెట్‌ తో పాటు సత్తెనపల్లి, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యే టికెట్లు కాపు సామాజికవర్గానికి కేటాయించింది. ఇదే సమయంలో గుంటూరు మేయర్‌ పదవిని కూడా కాపులకే ఇచ్చింది వైసీపీ. ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీకి ఇంతకు మించిన పరిష్కారం లేదని భావించాలి!