తెలంగాణ వీఆర్వో పరీక్షలో అవకతవకలు

తెలంగాణలో ఆదివారం జరిగిన వీఆర్వో పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. సెంటర్ మాదైతే ఉద్యోగం మీదే అని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆఫర్ ఇచ్చి పరీక్షలో మాస్ కాపీయింగ్ కు సహకరించాయని పలువురు విద్యార్దులు ఆరోపణలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాస్ కాపీయింగ్ జరిగిందని దానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని అభ్యర్దులు తెలిపారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల వీఆర్వో పరీక్షా కేంద్రంగా ఎంపికైంది. ఆదివారం జరిగిన వీఆర్వో పరీక్షలో ఈ సెంటర్ లోని 15 రూముల్లో 360 మంది అభ్యర్ధులు పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు 237 మంది హాజరయ్యారు. కళాశాల యాజమన్యం సాహితి అనే అభ్యర్ధికి స్లిప్పులు అందివ్వగా తోటి అభ్యర్థులు నిలదీయడంతో ఈ తతంగం బయటపడింది. సాహితి వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాడెంట్ కూతురు. సాహితిని పక్కకు పిలిచి ఆమె ఒక్కదానినే సపరేటు రూములో కూర్చొబెట్టి పరీక్ష రాయించినట్టు తెలుస్తోంది. సాహితి అస్వస్థతకు గురైందని అందుకే మెడికల్ వారిని పిలిచి మందులు  ఇప్పించి ప్రిన్సిపాల్ రూములో కూర్చొబెట్టి రాయించామని సూపరిండెంట్ అంటున్నారు. 

కళాశాల కరస్పాడెంట్ కూతురికి అదే కళాశాలలో సెంటర్ పడటం పలు అనుమానాలకు తావుతీస్తోందని పలువురు అన్నారు. మరో 24 మంది దగ్గర నుంచి కూడా రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పరీక్షలకు ఒక రోజు ముందు చీఫ్ సూపరిండెంట్ మహేందర్ ను మార్చి శ్రీకర్ ను నియమించడం, అతను పలువురు అభ్యర్ధులకు సహకరించడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జిల్లా అధికారుల ప్రోత్సాహంతోనే జరిగిందని విద్యార్ది సంఘాల నాయ కులు, నిరుద్యోగ అభ్యర్దులు అంటున్నారు. కష్టపడి చదివితే ఇలా అక్రమాలు చేస్తారా అంటూ పలువురు నిలదీశారు. ఈ పరీక్షా కేంద్రంలో జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. టిఎస్ పీఎస్సీ పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని పలువురు విమర్శించారు. 

అనేక మంది అభ్యర్దులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షను రాశారు. చాలా మందికి సంబంధం లేని ప్రాంతాల్లో సెంటర్లు వేశారు. నల్లగొండ వాళ్లకు ఆదిలాబాద్ లో , హైదరాబాద్ వాళ్లకు మంచిర్యాలలో, మహబూబ్ నగర్ లో ఇలా పరీక్షకు వెళ్లలేని విధంగా సెంటర్లు వేశారు. అంతే విధిగా రవాణా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. చాలా మంది ముందు రోజే పరీక్ష కేంద్రాలకు వెళ్లి ఉన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివితే అక్రమాలకు ప్రోత్సహిస్తారా అంటూ పలువురు అభ్యర్ధులు విస్మయం వ్యక్తం చేశారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 

ఈ విషయం పై మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు స్పందించారు. మాస్ కాపీయింగ్ విషయం పై ఇన్విజిలేటర్, చీఫ్ సూపరిండెంట్, లైజన్ అధికారి, అమ్మాయిని పిలిచి వివరాలు సేకరించామని, ఈ నివేదికను ముఖ్య కార్యదర్శికి పంపించామన్నారు. నివేదిక ప్రకారం ఉన్నత స్థాయి కమిటి చర్య తీసుకుంటుందని తెలిపారు.