ఈ పంతులమ్మ బదిలీపై పోతుంటే మీరు వెళ్లొద్దు మేడం అంటూ ఆ విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఆ పంతులమ్మను కదలనీయకుండా బిగ్గరగా పట్టుకున్నారు. నేను మళ్లీ వస్తానమ్మా… అంటూ కన్నీరు పెట్టుకుంటూనే ఆ పంతులమ్మ అక్కడి నుంచి కదిలింది. మేడం వెళ్లి పోయింది కదా అని ఆ విద్యార్థులు, గ్రామస్థులు ఊరుకోలేదు. మా మేడం మాకు కావాలంటూ గ్రామ సర్పంచ్ బాలచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చారు. చివరకు వారి శ్రమ ఫలించింది. ఆ పంతులమ్మ తిరిగి ఆ బడికే వచ్చింది. ఇక పిల్లల ఆనందానికి అవధులు లేవు.. చాలా ఆసక్తిగా ఉంది కదా ఆ కథేంటో మరి మీరూ చదవండి…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి ప్రాథమిక పాఠశాలలో శ్రీలత అనే ఉపాధ్యాయురాలు 9 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఆమె బదిలీ తప్పనిసరైంది. ఆమెను ఆదిలాబాద్ లోని కుమురంభీం కాలనీకి బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె వెళ్లిపోతున్నప్పుడు విద్యార్థులు కన్నీరు పెట్టుకొని మీరు వెళ్లొద్దు మేడం అంటూ అడ్డుకున్నారు. అయినా తప్పదు కదా .. ఆ పంతులమ్మ కూడా బాధాతప్తంతోనే ముందుకు సాగింది. అయితే ఆ పంతులమ్మ వెళ్లిన కుమురంభీం కాలనీ పాఠశాలలో విద్యార్థులు లేరు. దాంతో అధికారులు ఆమెను యాపాల్ గూడ పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపారు. విషయం తెలుసుకున్న సాంగిడి గ్రామస్థులు ఆ పంతులమ్మను మా పాఠశాలకే డిప్యూటేషన్ పై పంపించాలని విన్నవించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్థులు ఒత్తిడి చేయడంతో ఆ పంతులమ్మను తిరిగి సాంగిడి ప్రాథమిక పాఠశాలకే డిప్యూటేషన్ పై అధికారులు పంపించారు.
పంతులమ్మ తిరిగి రావడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లి విరిసింది. వినతి మేరకు ఒప్పుకొని గ్రామానికి వచ్చిన పంతులమ్మ శ్రీలతకు గ్రామస్థులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చిన్నారులు పంతులమ్మ చేయి పట్టుకొని బడికి తీసుకొచ్చారు. దీంతో సాంగిడి గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఒక్క టిచర్ కోసం ఊరు ఊరంతా ఏకమై రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పోరాడి తమ పంతులమ్మను తమ గ్రామానికే తీసుకొచ్చుకున్నారు. నిజంగా ఎంత మంది ఇలాంటి పంతులమ్మలు ఉంటారు చెప్పండి. పంతులమ్మ చదువుతోపాటు, క్రమశిక్షణ, సమాజం తీరును వివరిస్తూ పిల్లలపై ప్రత్యేక శ్రద్దతో అందరిని తమ బిడ్డలుగా చూసుకొని చదువు చెప్పేదని పూర్వ విద్యార్ధులు అంటున్నారు. అందుకే ఆ పంతులమ్మ అంటే వారికంత ప్రేమ. నిజంగా శ్రీలత లాంటి పంతులమ్మలు ఉంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిండుగా ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు.