వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, వారికి త్వరలోనే రాజకీయ గోరీ కట్టడం ఖాయమని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. దోపిడీదారులకు, రౌడీలకు అండగా నిలవడమే జగన్మోహన్ రెడ్డి పాలన అని ఆయన ధ్వజమెత్తారు.
వివరాల్లోకి వెళితే.. చింతమనేని ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఎన్నికల్లో ప్రజలు ఎక్కడ వాతలు పెట్టకూడదో అక్కడే వాతలు పెట్టినా వైఎస్ జగన్‌కు, అతని అనుచరులకు ఇంకా బుద్ధి రాలేదు. దోచుకోవడం, దోపిడీ చేయడమే వైసీపీ సిద్ధాంతంగా మార్చుకున్నారు,” అని మండిపడ్డారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై ఆయన వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. “తాను చేసిన దోపిడీకి సొంత భార్యను కేసులో ఇరికించి పారిపోయిన పేర్ని నాని, ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల గురించి నోరు పారేసుకుంటున్నారు,” అని చింతమనేని ఎద్దేవా చేశారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని ఉద్దేశించి మాట్లాడుతూ, “చేపల దొంగతనానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా జగన్ అనుచరులంతా తరలివచ్చారు. కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు, అబ్బయ్య చౌదరి అప్పుడప్పుడు దెందులూరుకు వచ్చి వెళ్తుంటాడు,” అంటూ చురకలంటించారు. వైసీపీ నేతలు తమ ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలను, దాడులను ప్రజలు గుర్తుంచుకున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.


