ఒకప్పటి సంగతి కాసేపు పక్కనపెడితే గత కొంతకాలంగా మీడియా పద్దతి పూర్తిగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మీడియా అంటే ప్రజల తరుపున మాట్లాడాలి.. ప్రభుతంపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. అంతేకానీ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు భజన బృందంలా మారకూడదని అంటారు. కాకపొతే కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇక గత ప్రభుత్వ హయాంలో అయితే జగన్ ఈ విషయంలో మొత్తుకున్నారు! ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు చేసిందని రాయండి, ప్రసరం చేయండి.. అంతే తప్ప జగన్ ఏమి చేసినా తప్పే.. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతాం.. మంచి చేస్తే చూపించం, చెడు చేస్తే మాత్రం బ్యానర్ ఐటం వేస్తాం అన్నట్లుగా ప్రవర్తన ఉండకూడదని ఫైరయ్యేవారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యేకు ఇలాంటి అనుభవం ఎదురైంది.
అవును… తనపై ఈనాడులో తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఆయన ఫైరయ్యారని తెలుస్తోంది. ఇదే సమయంలో… ఈనాడు మీడియా ప్రతినిధికి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. మరోసారి ఇలా తప్పుడు కథనాలు, వ్యతిరేక వార్తలు రాస్తే మాత్రం తాట తీస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే… ఈనాడు ప్రతినిధిపై విరుచుకుపడ్డారని తెలుస్తోంది! ఈ విషయాని స్వయంగా సదరు పత్రికే పేర్కొంది.
ఇందులో భాగంగా… తనపై వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా అంటూ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరించారని తెలుస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలోని మునగలపాళెం, వికృతమాల తదితర ప్రాంతల్లో కొంతమంది రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై “ఈనాడు”లో కథనం ప్రచురితమైంది.
ఈ విషయంపైనే టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఈ మేరకు తన వ్యక్తిగత సహాయకులతో ఈనాడు ప్రతినిధికి ఫోన్ చేయించి… తనకు వ్యతిరేకంగా వార్తలు రస్తే తాటతీస్తా.. ఏమనుకుంటున్నవ్.. ఇదే నీ చివరి హెచ్చరిక, తప్పుడు వార్తలు రాయొద్దు.. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో.. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే నీ కథ ముగిసినట్లే అని హెచ్చరిస్తూ దుర్భాషలాడారని తెలుస్తోంది.
దీంతో… ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈనాడులో రాసినట్లు ట్రాక్టర్ కు రూ.500 చొప్పున టీడీపీ నేతలు దోచుకుంటున్నారన్నది నిజమా.. లేక, అది తప్పుడు వార్త, ఈనాడులో తప్పుడు వార్తలు రాస్తున్నారన్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యే నుంచి వెళ్లిన హెచ్చరికలు వాస్తవమా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఏది నిజమనేది తెలియాలంటే.. వేచి చూడాలి!
ఈ నేపథ్యంలో… తన వరకూ వస్తే తప్ప తెలియదంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.