వైసిపికే ఓటేయండి..టిడిపి ఎంఎల్ఏ షాక్

అవును నిజంగా తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ అలాగే చెప్పారు. టిడిపి ఎంఎల్ఏ అయ్యుండీ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధికి ఓటేయమని చెప్పటంతో టిడిపి నేతలకు దిక్కుతోచ లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో టిడిపి గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నకల్లో గురజాల నియోజకవర్గంలో రెడ్డి అభ్యర్ధికే ఓట్లు వేయాలంటూ పిలుపిచ్చారు.

 

ప్రస్తుతం టిడిపి తరపున గురజాలలో సిట్టింగ్ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ తో తనకున్న సన్నిహితం కారణంగా వచ్చే ఎన్నికల్లో కూడా యరపతినేనే పోటీ చేయటం ఖాయం. అదే సమయంలో గురజాలలో వైసిపి తరపున కాసు మహేష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అంటే వైసిపి తరపున కాసు మహేష్ రెడ్డి, టిడిపి తరపున యరపతినేని పోటీ చేయటం ఖాయమైపోయింది. సరే, జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో తేలలేదనుకోండి అది వేరే సంగతి.

 

రేపటి ఎన్నికల్లో ప్రధాన పోటీ టిడిపి-వైసిపి మధ్యనే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో టిడిపి ఎంఎల్ఏ మోదుగుల వచ్చే ఎన్నికల్లో రెడ్డి అభ్యర్ధికే ఓట్లు వేయాలని పిలుపివ్వటమంటే అర్ధం ఏంటి ? వైసిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డికి ఓట్లు వేయమనే కదా చెబుతున్నది ? కారణం ఏమిటంటే, టిడిపిలో రెడ్ల పరిస్ధితి చాలా ఘోరంగా ఉందట. అందుకనే గురజాలలో మనోడినే గెలిపించుకోవాలని చెప్పారు.

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఒక్క రెడ్ల కోసమనే కాకుండా అందరి కోసం పనిచేసిన కారణంగానే అందరూ వైఎస్ ను దేవుడితో సమానంగా పోల్చి చూస్తున్నట్లు చెప్పారు. చివరకు తాను వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపిగా పోటీ చేయబోతున్నట్లు కూడా చెప్పారు. టిడిపిలో అయితే మోదుగులకు అవకాశం లేదు. ఆ విషయం మోదుగులకు తెలిసినా నరసరావుపేటలో ఎంపిగా తానే పోటీ చేస్తానని చెప్పటమేంటి ? అంటే త్వరలో వైసిపిలోకి మారిపోతారని జరుగుతున్న ప్రచారం నిజమే అనుకోవాల్సొస్తోంది.