వైనాట్ 175: జగన్ లక్ష్యానికి టీడీపీ, జనసేన సహకారం.!

విపక్షాలు ఎంతలా కొట్టుకుంటే, అధికార పక్షానికి అంత లాభం.! రాజకీయాల్లో ఈ ఈక్వేషన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? 2019 ఎన్నికల్లో టీడీపీ – జనసేన విడివిడిగా పోటీ చేయకుండా వుండి వుంటే, వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు ఆ ఎన్నికల్లో దక్కి వుండేవా.?

2024 ఎన్నికల్లో వైసీపీ లక్ష్యం 175 నియోజకవర్గాల్నీ గెలుచుకోవడం. అదే మాట పదే పదే చెబుతున్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదెలా సాధ్యం..? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నాసరే, ‘తగ్గేదే లే’ అంటున్నారు వైఎస్ జగన్.

ఎందుకు సాధ్యం కాదు.? టీడీపీ – జనసేన గనుక ఇంకోసారి విడివిడిగా పోటీ చేస్తే, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే తిరుగులేని విజయం. పైగా, 175 సీట్లకు గాను మొత్తంగా 175 సీట్లూ గెలుచుకునే సువర్ణావకాశం వైసీపీకి దక్కుతుంది.

టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్నాయ్. బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఆల్రెడీ వుంది. కానీ, టీడీపీతో కలవడానికి ససేమిరా అంటోంది బీజేపీ. ఇంకోపక్క, సీట్ల పంపకాల విషయమై లొల్లి కారణంగా టీడీపీకి అనుకూలంగా ఓటు వెయ్యబోమంటున్నారు జనసేన మద్దతుదారులు. జనసేనని రెచ్చగొడుతోంది వైసీపీ.

సీట్ల పంపకాలకు సంబంధించి టీడీపీ అవమానిస్తున్న తీరుతో జనసేన డీలాపడుతోంది. వెరసి, రేపో మాపో ‘పొత్తు లేదు’ అని ఇరు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ‘ఒకవేళ కలిసి పోటీ చేసినా ఓటు ట్రాన్స్‌ఫర్’ అయ్యేందుకు వీలు లేకుండా రెండు పార్టీల మధ్యా కింది స్థాయిలో గొడవలు పెరిగిపోయాయి.

నిజానికి, వైసీపీ ఏమీ చేయక్కర్లేదు. ఈ రెండు పార్టీలు ఒకదానితో ఒకటి అనవసర పంచాయితీ పెట్టుకుంటోంటే, జస్ట్.. ఆ గొడవకి ఆజ్యం పోస్తే సరిపోతుంది వైసీపీకి. అదే వైసీపీ చేస్తోంది కూడా.