మంగళగిరి: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా స్కీం లు తీసుకొచ్చి పేదవాడి రాతని మారుస్తున్నాం అని చెప్తూ వాటి ముసుగులో చాలా అవినీతి స్కాం లు చేస్తుందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ” ఇళ్లపట్టాలపేరుతో జగన్ ప్రభుత్వం ఏస్థాయిలో అవినీతికి పాల్పడిందో ఇప్పటికే ప్రజలకు వివరించడం జరిగింది. పేదవాడికి సాయం చేద్దామనే ఆలోచన ఏనాడూ జగన్ కు కలగదు. ప్రతినిత్యం ఏదో ఒక పథకం పేరు చెప్పడం, దాని ముసుగలో ఎలా దోచేయాలనే ఆలోచననే ఆయన చేస్తుంటాడని ఆయన అన్నారు.
అదే కోవలో ఇప్పుడు జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ వంటివి అందచేయడం జరుగుతుంది. గమ్మత్తు ఏంటంటే ఈ పథకాన్ని గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వం కంటే మెరుగ్గానే అమలు చేశాయి. ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో విద్యార్థులకు కానుకలు ఇస్తున్నట్లుగా మానిప్యులేట్ చేస్తూ జగన్ తనకు తానే కానుకలు ఇచ్చుకుంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. పేదవిద్యార్థులు ఉపయోగించే నోటు పుస్తకాల పంపిణీలో కూడా జగన్ ప్రభుత్వం ఎలా అవినీతికి పాల్పడిందో, జగన్ ఎంతలా కక్కుర్తి పడ్డాడో రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు మేన మామనంటూ జగన్ భారీగా మేసేస్తున్నాడు. అందుకే ఆయన విద్యార్థుల పాలిట మేనమామ కాదు ‘కంస మామ’ అని ఎప్పుడో చెప్పమని ఆయన గుర్తుచేశారు.
ఏపీటీపీసీ వారు విద్యార్థులకు పంచే నోటు పుస్తకాలను ‘లేపాక్షి నంది బ్రాండ్’తో ముద్రించేవారు. నాణ్యతతో కూడిన నోటు పుస్తకాలను సదరు సంస్థ ఎప్పటి నుంచో ప్రభుత్వానికి రాయితీపై అందిస్తోంది. కానీ వైసీపీప్రభుత్వం ఏపీటీపీసీ (లేపాక్షి నంది) ని కాదని, పుణెకి చెందిన బాఫ్నా కంపెనీని గత విద్యా సంవత్సరంలోనే తెరపైకి తీసుకుని ర్తావటం జరిగింది. 06-10-2020న ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం- 55లో ప్రభుత్వపాఠశాలలువారు, నోట్ బుక్స్ ఆర్డర్ ని ఏపీటీపీసీ కి మాత్రమే ఇవ్వాలని చెప్పడం జరిగింది. జీవోనెం55ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని గారు జారీచేయడంజరిగింది.
ఆజీవోను తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం తాజాగా ఈ విద్యా సంవత్సరం (2021-22) నోటు పుస్తకాల సేకరణకు సంబంధించి 21-01-2021న ఒక టెండర్ విడుదలచేసింది. చీఫ్ సెక్రటరీ గతంలో ఏపీటీపీసీ ఆధ్వర్యంలోని లేపాక్షినంది నోటు పుస్తకాలను వాడాలని చెప్పి, జీవోనెం55ని జారీచేసినా, దాన్ని కాదని బయట కంపెనీలకు దోచిపెట్టడానికి ఇప్పుడు 2కోట్ల పైచిలుకు నోటు పుస్తకాల ముద్రణకు టెండర్ విడుదలచేస్తారా? నోటు పుస్తకాల అంచనాలు ఇంకా15శాతం పెరిగే అవకాశం కూడా ఉందని టెండర్లో చెప్పారు. ఒక్కో నోటు పుస్తకం ఖరీదు రూ.40 వేసుకున్నా దాదాపు రూ.80కోట్లు అవుతుంది. అంచనాలుపెరిగితే అది రూ.100కోట్లు కావచ్చు. పేద విద్యార్థులకు ఇచ్చే నోటు పుస్తకాల్లో కూడా ప్రైవేట్ కంపెనీ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, రాష్టప్రభుత్వ సంస్థ అయిన ఏపీటీపీసీ వారి లేపాక్షి నంది నోటు పుస్తకాలను నాశనం చేస్తున్నారని ఇదొక పెద్ద స్కాం అని ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తక్షణమే నోటుపుస్తకాల టెండర్ ను రద్డు చేసి ఏపీటీపీసీ వారి లేపాక్షి నంది కంపెనీకి తిరిగి బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.