దేశవ్యాప్తంగా “టమాటా” రాజకీయాలు… ఏపీ స్థానం ఎక్కడ?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఆయ్యా రాష్ట్ర ప్రభుత్వాలపైనా, అంతా కలిసి కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా ఈ టమాటా పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్న వేళ.. ఈ రచ్చలో ఏపీ ఎక్కడ అనే టాపిక్ తెరపైకి వచ్చింది.

అవును… దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… టమాటా ధర కొండెక్కుతుండగా.. పచ్చి మిర్చి ధర ఘాటెక్కిస్తోంది. టమాటా ధర కేజీ రూ.150 దాటగా.. పచ్చిమిర్చి కేజీ రూ.200 చేరిందని తెలుస్తుంది. ఇదే సమయంలో అలాగే రెండు కట్టల ఆకు కూరల ధర రూ.25 దాటిందని అంటున్నారు. ఇక బీరకాయ, బెండకాయ ధరలు కూడా కేజీ రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయని తెలుస్తుంది.

ఈ సమయంలో తెలంగాణలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ… ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ ని ఇరుకునపెడుతున్నాయి. ధరలు అదుపుచేయలేకపోతున్నారంటూ ఫైరవుతున్నాయి! ఆఖరికి రైతు బజార్లలో కూడా ఇవే ధరలు పలకుతున్నాయంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే క్రమంలో… హనుమకొండలోని తిరుమల జంక్షన్ లో టమాటాలు ఉచితంగా పంపిణీ చేస్తూ.. కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేతలు.

దీంతో ఈ సమయంలో ఏపీలో విపక్షాలు ఎక్కడ? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇపాటికి టమాటాలు పట్టుకుని, వాటితో రోడ్లపైకి వచ్చి ఇపాటికి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలి కదా.. జనసేన, టీడీపీ నేతలు మూకుమ్మడిగా కలిసి మరీ ప్రభుత్వంపై ఫైరవ్వాలి కదా అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్… విపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు!

నిత్యావసర కూరగాయల ధరలు పెరుగుతుండటంతో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టమాటాను రైతు బజార్లలో సబ్సిడీపై అందిస్తోంది. రాయితీపై రూ.50కే కిలో టమాటా అందిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. దీంతో… టమాటా రాజకీయాల్లో ఏపీ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా చేశారు సీఎం జగన్ అంటూ ఆన్ లైన్ లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.