తెలుగు మీడియా లో ఇప్పటికే చాలా ఛానల్స్ ఉన్నాయి. అయితే, ఇందులో కొన్ని మొదట్లో చాలానే హడావిడి చేసి, ఆ తరవాత కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పడున్న మీడియా సంస్థలు ఎదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి చాలవు అన్నట్టుగా ఇప్పుడు మరొ పొలిటికల్ ఛానల్ అవిష్కరించబోతుందని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.
అయితే ఈ ఛానల్ కూడా త్వరలో తెలంగాణలో పురుడు పోసుకోనున్న రాజకీయ పార్టీకి సంబంధించినదేనని తెలుస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని, అందుకే కొత్తగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.. రేపో, మాపో పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండాను కూడా అనౌన్స్ చేయన్నారు. అయితే పార్టీకి సంబంధించిన విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే మీడియా అనేది తప్పనిసరని షర్మిల భావించారట.
దీనితో తమకంటూ ఓ వాయిస్ కావాలని కొత్త ఛానల్ పెట్టేందుకు షర్మిల రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే ఛానల్ ఏర్పాటుకి సంబంధించిన విషయాల కోసం సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తిని ఇటీవల షర్మిల పిలిపించుకుని మాట్లాడినట్లుగా సమాచారం. గతంలో ఆయన హెచ్ఎంటీవీ మీడియా సంస్థకీ ఎడిటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాక్షిలో అయన కీలకమైన పదవిలో ఉన్నారు. అయితే కొత్తగా ఏర్పాటు అయ్యే ఈ ఛానల్ కు ‘వైఎస్ఆర్ టీవీ’గా నామకరణం చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ‘సాక్షి’ అనే సొంత ఛానల్ ఉండనే ఉంది. అయితే ఇదే ఛానల్ నుంచి షర్మిల పార్టీకి ప్రచారం జరిగితే రాజకీయాల పరంగా ఇబ్బంది వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీనితో షర్మిల కొత్త టీవీ ఛానల్ వైపు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.