సజ్జల ఉవాచ: 95 శాతం పూర్తి చేసేశాం.!

sajjala

95 శాతం పూర్తి చేసేశాం.. ఇది పరమ రొటీన్ వ్యవహారమైపోయింది. టీడీపీ హయాంలో చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పేవారు. టీడీపీ నేతలు, అప్పటి మంత్రులూ, ‘ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చేశాం..’ అని చెప్పుకునేవారు. చివరికి ఆ ప్రచారం తుస్ అయిపోయింది. అధికారం టీడీపీకి దూరమయ్యింది. మరి, వైసీపీ పరిస్థితి ఏం కాబోతోంది.?

తాజాగా వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చేశామని చెబుతున్నారు. అది నిజమే అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసి వుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయి వుండాలి. రాజధాని అమరావతి అభివృద్ధి చెంది వుండాలి. కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇవన్నీ కార్యరూపం దాల్చెయ్యాలి.

సీపీఎస్ రద్దు సహా చాలా చాలా చేసేసి వుండాలి వైఎస్ జగన్ సర్కారు.. ఒకవేళ ఎన్నికల హామీల్ని 95 శాతం పూర్తి చేసేశామని చిత్తశుద్ధితోనే చెబుతుంటే. అంతెందుకు, మద్య నిషేధం కూడా అమలు కాలేదు. సామాజిక పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లను 3 వేలకు పెంచలేదు కూడా.

సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి, జగన్ సర్కారు.. అన్నిటినీ పూర్తి చేసెయ్యాలనుకోవడం కూడా సబబు కాదు. కానీ, ప్రజల్ని మభ్యపెట్టి వైఎస్సార్సీపీ ఏం సాధిస్తుంది.? అన్నదే అసలు ప్రశ్న. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అప్పుడే, ఇంకోసారి ప్రజలు నమ్మే పరిస్థితి వుంటుంది.

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, చేస్తోన్న సంక్షేమం వల్ల వచ్చే అభివృద్ధి ఫలాలు ఏమీ వుండవ్. చెప్పినవన్నీ చేసేశాం.. అని చెప్పుకోవడం కాదు, ఈ కారణాల వల్ల సగం కూడా చెయ్యలేకపోయాం.. అని చిత్తశుద్ధి చెబితే, వైసీపీని ప్రజలు అర్థం చేసుకుంటారు.