గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏంటంటే… షర్మిలమ్మ కొత్త పార్టీ. వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ వద్దని జగన్ చెప్పినా వినకుండా షర్మిల పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు సజ్జల. షర్మిల పార్టీ పెట్టాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని.. ఈ క్రమంలో సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు వద్దని వారించినా షర్మిల తన వ్యక్తిగత నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇప్పుడు కానీ, భవిష్యత్తులోగానీ తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి తమ మద్దతు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. షర్మిల పార్టీ పెట్టినా ఏపీ ప్రయోజనాలే సీఎంకు ముఖ్యమని చెప్పారు.
తెలంగాణ రాజకీయాలపై వైఎస్ జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని జగన్ తేల్చి చెప్పారు. తెలంగాణలో వైసీపీ లాంటి పార్టీ ఉండాలనే ఉద్దేశమే తప్ప జగన్ – షర్మిల మధ్య బేధాభిప్రయాలు లేవని ఆయన అన్నారు. వైఎస్ జగన్ తో వచ్చి విభేదాల కారణంగానే షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలను సజ్జల కొట్టిపారేశారు. కొత్తపార్టీ పెడితే వచ్చే అనవసర ఇబ్బందులెందుకని జగన్ అన్నారని.. తెలంగాణలో పాదయాత్ర చేసిన కారణంగా అక్కడ ప్రజల మద్దతుంటుందని వెళ్తానని షర్మిల స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రాజకీయపరంగా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.