సీబీఐది చెత్త విచారణ.! సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వెనుక.!

దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో సీబీఐ ఒకటి.! సీబీఐ చేతికి ఏదన్నా కేసు వెళ్ళిందంటే.. నిజానిజాలు నిగ్గు తేలాల్సిందే. కానీ, అది ఒకప్పటి సంగతి. సీబీఐని ‘పంజరంలో చిలక’గా సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణించిన సందర్భాలున్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దగ్గర్నుంచి సీబీఐ మీద విమర్శల జోరు చూస్తూనే వున్నాం. ఆ మాటకొస్తే, పరిటాల రవి హత్య కేసు తర్వాతనే, సీబీఐ మీద జనానికి వున్న గౌరవం పోయిందనడం అతిశయోక్తి కాదేమో. సీబీఐ ఏదన్నా కేసుని విచారిస్తోంటే చాలు.. రాష్ట్రంలో రాజకీయం వెర్రి తలలు వేస్తోంది.

మీడియా ట్రయల్స్.. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైపోయాయ్. సీబీఐ విచారణ ఎలా సాగుతోందో, రాజకీయ పార్టీలకు అనుబంధంగా సాగుతున్న మీడియా సంస్థలే సెలవిస్తున్నాయ్.! చిత్రంగా సీబీఐ విచారణలు కూడా అలాగే సాగుతున్నాయేమోనని కొన్ని సందర్భాల్లో అనిపిస్తోంది కూడా.

ప్రస్తుతం మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ హాట్ టాపిక్. సీబీఐ ఏళ్ళ తరబడి ఈ కేసుని విచారిస్తోంది. దోషులెవరన్నది తేలలేదు. నిందితుల విషయంలో పూర్తి గందరగోళం. ఎవరి గోల వారిదే. తాజాగా, సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు తెరపైకొచ్చింది ఈ కేసులో. దాంతో, సజ్జల ఉలిక్కిపడ్డారు, సీబీఐది చెత్త విచారణగా తేల్చేశారాయన.

దురదృష్టకరమేంటంటే, సీబీఐ ఏ కోణంలో విచారణ చేయాలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మీడియా ఉచిత సలహాలు ఇస్తుండడం. ఇంకెందుకు సీబీఐ.? అంతే కదా.! పోలీస్ కావొచ్చు, సీబీఐ కావొచ్చు, న్యాయ స్థానాలు కావొచ్చు.. వీటితో రాజకీయ పార్టీలకు పనిలేదన్నట్టు తయారైంది పరిస్థితి.

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి విజ్ఞులు కూడా దర్యాప్తు సంస్థలపై ఇలా మాట్లాడితే ఎలా.?